ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాదుడే బాదుడు, పార్టీ మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడు నిర్వహణపై చంద్రబాబు గ్రామ, మండల స్థాయి నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరుపై సమీక్ష చేశారు.
ప్రజల భవిష్యత్‌కు టీడీపీ భరోసాగా కనిపిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన పర్యటనల్లో వస్తున్న స్పందనను కూడా నేతలతో చంద్రబాబు పంచుకున్నారు. నాయకులు అనే వారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. అన్ని వర్గాలలో, అన్ని ప్రాంతాలలో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. టీడీపీకి ఇదొక మంచి చిహ్నం అని చంద్రబాబు అన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర కష్టాల పాలయ్యారన్నారు. పాలనా వైఫల్యాలు, ప్రభుత్వ నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు టీడీపీ ఒక హోప్‌గా (ఆశ) కనిపిస్తుందని అన్నారు.
బాదుడే బాదుడు కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఇంటింటికీ వెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. టీడీపీ శ్రేణులు, నేతలు గ్రామాల్లో ఇళ్ల కు వెళుతుంటే.. ప్రజలు ఎదురొచ్చి తమ కష్టాలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇదే సందర్భంలో వైఎస్సార్సీపీ నేతలు గడప గడపకు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళుతుంటే సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.
ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమనే విషయం సీఎం జగన్‌కు అర్థమవుతోందని చెప్పారు. వీటన్నింటినీ గమనించిన ముఖ్యమంత్రి జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. 2024 కంటే ముందుగా ఎన్నికలు వచ్చినా వచ్చే అవకాశం ఉందని.. కేడర్, లీడర్ అన్నింటికి సిద్దపడి ఉండాలని అన్నారు.
![]() |
![]() |