ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 11:23 AM

వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు దాటింది. ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో మెజార్టీ స్థానాలు మార్పులు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో ఎవరికివారు ఆశల పల్లకిలో ఊరేగితున్నారు.


వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రెండన్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ తొలుత చెప్పిన మాటలకు భిన్నంగా సాధ్యమైనంత త్వరగా కేబినెట్‌లోకి కొత్త ముఖాలను తీసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన తప్పదంటూ వస్తున్న సంకేతాలు అధికారపార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.దీంతో ఎవరికి పదవి ఉంటుంది, ఎవరికి ఊడుతుందన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.


ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు,వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలలో గత కొద్ది రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరికి మంత్రి పదవి వస్తుందో ఎవరికి ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. విజయనగరం జిల్లాలో మొత్తం గత స్థానిక ఎన్నికల నాటికి 18.88 లక్షల మంది ఓటర్లు ఉండేవారు. తొమ్మిది నియోజకవర్గాలుగా ఉండగా పుష్ప శ్రీవాని పాముల (కురుపాం), అలజంగి జోగారావు (పార్వతిపురం), పీడిక రాజన్న దొర (సాలూరు ) శంబంగి వెంకట చిన అప్పల నాయుడు (బొబ్బిలి ) , బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బొత్స.అప్పలనరసయ్య (గజపతినగరం), అప్పలనాయుడు బడ్డుకొండ (నెల్లిమర్ల), వీరభద్ర స్వామి కోలగట్ల (విజయనగరం ), కడుబండి శ్రీనివాస రావు (శృంగవరపుకోట) వాటిలో 9 లో తొమ్మిది వైసిపి కైవసం చేసుకుంది.


మొదట మంత్రివర్గంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కు, పాముల పుష్ప శ్రీవాణి చోటు దక్కింది. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు చివరి నిమిషంలో మంత్రి పదవి నిరాశ పరిచింది. ఐతే మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు వార్తలు రాగానే మంత్రి పదవుల కోసం ఎవరికి వారు రేసులో తాము ఉన్నాము అంటే, తాము రేసులో ఉన్నాము అన్నట్టుగా సంకేతాలు పంపిస్తున్నారు.


సామాజికవర్గాల సమీకరణలు కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉండగా, మరి కొంతమంది సీనియారిటీ, విధేయత వంటి వాటిని హైలెట్ చేసి చూపిస్తూ, ఈసారి జగన్ తమను తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు అని, తమకు అవకాశం దక్కుతుందని, తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి పదవి లిస్ట్ లో తమ పేరు ఉండేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నాయకులను ఇదే విషయమై ఆరా తీస్తూ, తమ పేరు మంత్రివర్గ విస్తరణలో ఉండేలా చూడాలంటూ కోరుతున్నారు. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లు మంత్రి పదవుల విషయంలో తెరపైకి వస్తూనే ఉన్నాయి.పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి, రాజన్నదొర, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తాము మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.


నూతన మంత్రివర్గం విస్తరణలో చోటు


ప్రస్తుతానికి మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణకు కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది అని ఉంటున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సాలూరు నుంచి పిడికి రాజన్నదొర గెలిచారు. అంతే కాదు ఏనాడూ పార్టీ లైన్ దాటలేదు. పైగా ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకొరకు పాముల పుష్ప శ్రీవాణి ను తప్పించి రాజన్న దొర కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వైసిపి వర్గాలు అంటున్నాయి.


విజయనగరం జిల్లా నుండి మాత్రం రెండు మంత్రి పదవులు పక్క దక్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. శంబంగి వెంకట చిన్ని అప్పలనాయుడుకి శాసనసభ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని, వీరభద్ర స్వామికి మరి ఏదో పదవి కట్టబెట్టాలని వైయస్ జగన్ ఆలోచనలో ఉన్నదని వైసిపి వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి కొద్ది రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com