ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతని వద్ద ఏకంగా 190 దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 05, 2022, 12:06 PM

దేశ విదేశీ నాణాలు, కరెన్సీ నోట్లు సేకరణలో చరిత్ర సృష్టించాడు ఆ వ్యక్తి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 190 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణ్యాలు సేకరించి సామాన్య ప్రజలు ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు.


దేశంలో దాదాపు 20 రాష్ట్రాలకు పైగా తిరిగి తాను అనుకున్నది సాధించాడు. ఈ ఘనతను సాధించడానికి అతనికి దాదాపు 20 సంవత్సరాలకు పైగా పట్టింది. ఇంతకు ఆ వ్యక్తి సాధించిన ఘనత ఏంటో, అతను సేకరించిన నాణేల కరెన్సీ నోట్లు సంగతి ఏంటో ఒకసారి మీరే చూసేయండి.


ప్రకాశం జిల్లా కొమరోలు మండలం కొమరోలు పట్టణంలో నివాసముంటున్న తాళ్లపల్లి వెంకట సుధాకర్ రావు అరుదైన ఘనతను సాధించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు గా విద్య అభ్యసించి విధి అనుకూలించక చిరు వ్యాపారిగా స్థిరపడ్డారు.


దేశ విదేశీ నగదును సేకరించే హాబీగా పెట్టుకొని ఏకంగా 190 దేశాలకు చెందిన నగదు సేకరించి ప్రతి ఒక్కరిని అబ్బురపరిచారు.అంతేకాదు భారతదేశానికి స్వతంత్రం రాక ముందు నుంచి కూడా ఉన్న నగదును సేకరించి నగదు సేకరణలో అతను కొత్త ఒరవడి సృష్టించాడు.


190 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను, నాణేలు తాను సొంతం చేసుకోవడంతో పాటు సిక్స్త్ కింగ్, ఫిఫ్త్ కింగ్, విక్టోరియా మహారాణి, ఎడ్వర్డ్స్ కాలం నాటి వెండి నాణాలు సేకరించాడు. చోలులు, గుప్తులు, శౌరులు, మౌర్యులు, మొఘల్ సామ్రాజ్యానికి కాలపు నాటి నాణాలతో పాటు మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి పగోడా శ్రీదేవి భూదేవి సమేత బంగార నాణెం సేకరించాడు. ఈ నాణెం ఎంతో విలువైనదని 20 సంవత్సరాల క్రితం సేకరించినప్పుడే దీని విలువ 23 వేల రూపాయలు ఉందని సుధాకర్ రావు అన్నాడు.


భారతదేశానికి చెందిన నాణాలు దమ్మిడీ, అణ్ణ, బొట్టు, బొక్క బొట్టు, రాగి పైసా, పైసా, ఐదు పైసలు, 20 పైసలు, పావుల, అర్ధ రూపాయి, రూపాయి దగ్గరి నుంచి మొదలుకొని 500 రూపాయల నాణాల వరకు తాను సొంతం చేసుకున్నాడు.


ఇక రూపాయి నోటు నుంచి ప్రస్తుతం చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల వరకు అన్ని రకాలు సేకరించాడు. స్వతంత్రం రాకముందు ఉన్న నగదు ఈస్ట్ ఇండియా నాణేలు కూడా సేకరించి తనకు నాణాలు సేకరించడంలో ఎంత ఉత్సాహవంతుడినో అని నిరూపించుకున్నారు.


తాను సేకరించిన భారతదేశానికి సంబంధించిన నాణాలలో ఒక్క రూపాయి 65 రకాలు, రెండు రూపాయల నాణాలు 60 రకాలు, 5 రూపాయల నాణాలు 60 రకాలు సుధాకర్ రావు సాధించి రికార్డు సృష్టించాడు.


తాను సేకరించిన ఈ దేశీ, విదేశీ నగదును స్థానిక ప్రజలకు విద్యార్థులకు చూపించి పూర్వం నగదును ఎలా ఉండేదో ఎలా వీటిని వినియోగించే వారో అవగాహన కల్పిస్తానని సుధాకర రావు చెప్పారు. ఈ ఘనత సాధించడంలో తన స్నేహితులు, బంధువులు తనకు చేయూతను అందించారు అని వారికి నేను రుణపడి ఉంటానని సుధాకర్ రావు అన్నారు.


చూశారు కదా మనిషి సాధించాలనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, పట్టుదలతో ఏకంగా 190 దేశాలకు పైగా కరెన్సీ నోట్లు, నాణాలు సేకరించి అందరిని అబ్బుర పరిచారు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని సుధాకర్ రావును చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com