శ్రీకాకుళం: 'నేను శానిటైజర్ తాగాను.. అందరికి బై.. గుడ్ బై..' అంటూ తను చదివే తరగతి గదిలోని బోర్డుపై రాసి ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన టెక్కలి పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం మహాత్మాగాంధీ జ్యోతి బాపూలే బీసీ బాలికల వసతి గృహాంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం.. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం వేకువజాము నుంచి కనిపించడంలేదు. ‘నేను శానిటైజర్ తాగాను.. అందరికీ బై.. గుడ్‌బై’ అంటూ తరగతిలోని బోర్డుపై సుద్దముక్కతో రాసి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ‘నన్ను గుర్తుంచుకోండంటూ కొందరు స్నేహితులకు జ్ఞాపికలు అందించడం.. అదే తరగతి గది శ్లాబ్ హుక్కుకు బాలిక చున్నీ వేలాడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు అక్కడే ఉన్న వసతి గృహ సిబ్బందికి తెలిపారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ బోడ దామోదరరావు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆమె కోసం గాలించారు.
ఈ విషయాన్ని కోటబొమ్మాళి మండలం కురుడులో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా, బాలిక పాఠశాల సిబ్బంది కళ్లుగప్పి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. సోమవారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య శ్రీకాకుళం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌లో ఆమె ఓ అపరిచిత వ్యక్తికి ఫోన్ అడిగి తన చిన్నాన్న నంబర్‌కు కాల్ చేసింది. పిన్నితో మాట్లాడమ్మా అంటూ.. అతను చెప్పేలోగా బాలిక ఫోన్ కట్ చేసింది. అక్కడ నుంచి ఆమె జాడ తెలియలేదు. పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిందని భావించిన ప్రిన్సిపాల్ దామోదర రావు టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, విద్యార్థిని బ్యాగ్‌లో రెండు పేజీల ఉత్తరం లభ్యమైంది. ‘డాడీ మందు మానేయాలి.. మమ్మీ, డాడీ, అక్క ముగ్గురు కలిసి ఉండాలి.. ఎవరూ బాధపడకండి’.. వంటి వివరాలు ఆ లేఖలో ఉన్నాయి. మరికొన్ని ఉత్తరాలు చించి చెత్తబుట్టలో వేసినట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎస్‌ఐ కామేశ్వరరావు దర్యాప్తు చేపడుతున్నారు. బాలిక జాడకై దర్యాప్తు చేపట్టారు.