మేకపోతు విలువ ఎంత ఉంటుందో.. ఆ గుమ్మడికాయ కూడా అంతే విలువతో సమానంగా చూస్తారు అక్కడి గిరిజన రైతులు. అక్కడ గుమ్మడికాయ ఇస్తే మేకపోతు ఇచ్చినంత ఫీలి అవుతారట. అంతేకాదు గుమ్మడికాయ ఆకులకు కూడా ప్రత్యేక పండగ కూడా ఉంటుంది. గుమ్మడి ఆకులో అన్నం తినేందుకు కొర్రకొత్త పండగ కూడా చేస్తారు గిరిజనులు. పెళ్లిళ్లలో ప్రత్యేకంగా గుమ్మడి కాయకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకీ ఇదంతా ఎక్కడో అనుకుంటున్నారా..?
విశాఖ ఏజెన్సీలో గిరిజనులు గుమ్మడికాయకు ప్రత్యేకంగా ఆదరణ చూపిస్తారు. పంటల్లో అత్యంత విలువైన పంటగా భావించే.. గుమ్మడి కాయను భద్రపరిచేందుకు కూడా గిరిజనులు అంతే ప్రాధాన్యత ఇస్తారు. సీజన్లలో పండే గుమ్మడి కాయలను.. ఏడాదంతా వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. దీనికితోడు, వచ్చే సీజన్లో గుమ్మడి గింజల కోసం కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ఇంట్లో పెడితే ఎలుకల భయం..! అందుకే.. పెరట్లో ఉన్న చెట్లకు గుమ్మడి కాయలను ఇలా వేలాడదీస్తారు.
చెట్టుతో సంబంధం లేకుండా.. మామిడి, జామ, ఉసిరి ఇలా ఏ చెట్టు కైనా గుమ్మడి కాయలను ప్రత్యేకంగా కట్టి దాచుకుంటారు. విశాఖ ఏజెన్సీలో గుమ్మడి కాయలు నిల్వ ఉంచేందుకు గిరి రైతులు.. ఈ ఫార్ములాను వాడుతుంటారు. చెట్టుకు కడితే ఎక్కువరోజులు నిలవ కూడా ఉంటుందని చెబుతున్నారు. గిరిజనులు గుమ్మడి కాయలను ఎక్కువగా ఆహారంగా కూడా తీసుకుంటుంటారు. అందుకే వీటిని అంత భద్రంగా చూసుకుంటారు. ఇదీ విశాఖ ఏజెన్సీలో వేలాడుతున్న గుమ్మడికాయల కథ.