ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు: గుంటుపల్లి శ్రీదేవి చౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 02:27 PM

వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు ఎక్కువై పోయాయని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి ఆరోపించారు.


ఈ సందర్భంగా శనివారం కావలి పట్టణంలోని ఆమె నివాసంలో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఏపీని అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారన్నారు. రాష్ట్రంలో చట్టాలు అపహాస్యమవుతున్న తీరు, అధికారపార్టీకి జేబు సంస్థగా మారిన పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ రాక్షసమూక ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు.


చిన్నారులకు మేనమాననంటూ ప్రగల్బాలు పలికిన సీఎం, తాను పెంచి పోషించిన విషపు మొక్కలే అభం, శుభం తెలియని పసిపాపలను కాటేస్తుంటే బయటకు ఎందుకు రావడం లేదని, కళ్లముందే ఇన్ని ఘోరాలు జరిగిపోతుంటే చలనం ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. సెకండ్ వేవ్ లో కరోనా సోకి తల్లితో పాటు ఆస్పత్రిలో చేరిన చిన్నారి జీవితాన్ని వైసీపీ నాయకుడు కన్నా భూశంకర రావు చిదిమేశాడన్నారు.


బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించి చిత్రవధకు గురిచేశాడన్నారు. భూ శంకర్ రావు అరెస్ట్ అయ్యాడు కాబట్టి విషయం బయటకు వచ్చిందని, కానీ రోత పనులు చేసి బయటకు పొక్కకుండా తప్పించుకునే వైసీపీ మృగాళ్లు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారన్నారు. మరి వారందరికీ ఎప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు.


ఎప్పుడూ వైసీపీ నేతల తరపున వకాల్తా తీసుకోవడమే కాకుండా, ఒక్కసారి అయినా బాధితులకు అండగా పోలీస్ బాస్ నిలవాలన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రకారం మానవ అక్రమ రవాణా దేశంలోనే మహారాష్ట్ర తర్వాత ఏపీ 2వ స్థానంలో ఉందని, ఇలా అక్రమంగా తరలిస్తున్న మహిళలు, బాలికల్లో 74 శాతం మందిని బలవంతంగా వ్యభిచారకూపంలోకి నెట్టేస్తున్నారన్నారు.


2021లో రాష్ట్రంలో అత్యాచారం, వేధింపులు పోక్సో కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. 2020లో బాలికలపై అత్యాచారాలకు సంబంధించి 1, 802 కేసులు నమోదు కాగా 2021లో 2, 097 కేసులు వచ్చాయని డీజీపీనే స్వయంగా వెల్లడించారన్నారు. ఇంటి నుంచి గడపదాటిన చిన్నారి జాగ్రత్తగా ఇంటికి తిరిగొస్తుందనే నమ్మకం లేని దుస్థితికి వైసిపి ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఉదాశీనతే కారణమన్నారు.


మహిళలపై నేరాలకు సంబంధించి అతి తక్కువ శిక్షలు పడుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 5వ స్థానంలో ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ని ఏ స్థాయిలో నేరగాళ్లకు అడ్డాగా మార్చారో అర్ధమవుతుందన్నారు. మేకతోటి సుచరితను హోంమంత్రి చేసినప్పుడు ప్రజలకు అండగా నిలబడతారని మహిళలు ఆశించారని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటారని భావించారని, కానీ సేవ్ వైసీపీ - టార్గెట్ టీడీపీ అన్నట్టుగానే హోంమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు.


పైగా సుచరిత హోంశాఖ బాధ్యతలు తీసుకున్నాక మహిళలపై అత్యాచారాలు తగ్గకపోగా పెరగడం సిగ్గుచేటన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి నివసించే గుంటూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.


తెలుగుదేశం హయాంలో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు, మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై ఉక్కుపాదం మోపడంతో నేరాలు అదుపులోకి వచ్చాయన్నారు. టీడీపీ హయాంలో మహిళలు, బాలికలు, చిన్న పిల్లలపై అకృత్యాలను అరికట్టడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకుని రహస్యంగా కాపాడేందుకు సబల కార్యక్రమం ప్రారంభించి విజయవంతంగా అమలు చేశామన్నారు.


కానీ వైసీపీ పాలకులే నేరస్థుల అవతారమెత్తారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసిన ఒక్కరినీ శిక్షించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిది నేరస్థులకు ఫ్రెండీ గవర్నమెంట్ గా ఉన్నదని ఆమె దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com