శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో పలుమార్లు భూమి స్వల్పంగా కంపించడంతో ఉద్దానం ప్రజలు భయపడుతున్నారు. మొదటగా డిసెంబరు 29వ తేదీ వేకువజామున 5 గంటల తరువాత ఓసారి స్వల్పంగా భూమి కంపించింది. అనంతరం మంగళవారం రాత్రి ప్రకంపన కాస్త అధికంగా ఉండడం వారి ఆందోళనను మరింత పెంచింది. గత అదే విధంగా మంగళవారం రాత్రి 10. 02 గంటల నుండి వేకువఝాము వరకు సుమారు ఎనిమిది సార్లు కు పైగా ప్రకంపనలు రావడంతో జనమంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు.
పట్టణంలోని పురుషోత్తపురం, ఏఎస్ పేట, రత్తకన్న, బెల్లుపడతో పాటు మండలంలోని మండపల్లి, ఎం. తోటూరు, తేలుకుంచి, లొద్దపుట్టి, కొఠారీ, ఈదుపురం, కేశుపురం గ్రామాలతో పాటు కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో అక్కడక్కడా భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మట్టి ఇళ్లల్లోని పగులుదేరగా, ఇళ్లలోని సామాన్లు చిందరవందరగా పడ్డాయి. అయితే అధికారులు మాత్రం ఎలాంటి భయం లేదంటూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.
తహసీల్దార్ శ్రీహరిబాబు మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జరిగిన భూ ప్రకంపనలపై విజయవాడ నుంచి ప్రకృతి వైపరీత్యాల సంస్థ అధికారులు ఫోన్ ద్వారా సమాచారాన్ని సేకరించారని, త్వరలో నివేదిక అందజేస్తామని తెలిపారని పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్ పై 4. 4 తీవ్రత నమోదైనట్లు తెలిపారని పేర్కొన్నారు.
ఇచ్ఛాపురం మండలంలో కొన్ని గ్రామాల్లో బుధవారం రాత్రి 9. 50 గంటలకు మళ్లీ రెండు, మూడు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం రాత్రి 11. 20 గంటల మధ్య సుమారు పది సార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో నాలుగోసారి భూమి కంపించడంతో వారు భయాందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం ప్రకంపనలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, లేకుంటే జాగ్రత్తలు తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.