డిస్ట్రిబ్యూటర్ల కు లేని బాధ ఈయనకు ఎందుకు? : మంత్రి బొత్స

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 03:07 PM
 

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి, ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. జీఎస్టీ లాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం మంత్రి బొత్స స్పష్టం చేశారు. సినిమ టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారని మంత్రి వెల్లడించారు. వాళ్ళకు లేని బాధ పవన్ కళ్యాణ్ కి ఎందుకు? అని నిలదీశారు.


వైసీపీ మంత్రులు సన్నాసులైతే.. పవన్ కళ్యాణ్ ఋషి పుంగవుడా? అని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. నోరు ఉంది కదా అని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో ఏవైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. చిత్ర పరిశ్రమ పవన్ కళ్యాణ్ ఒక్కడికి సంబంధించి కాదు కదా? అని అన్నారు. చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే, మీ ఇష్టానుసారంగా ఉండటం కుదరదు అని పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టం అని, ఆ విషయంలో సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.