ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ వస్తే పవన్ కి ఏంటో భయం! : వెల్లంపల్లి

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 01:30 PM
 

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. వినోదం పేరుతో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు మంత్రి 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. దోపిడీని అరికడుతుంటే.. పవన్‌కి అంత ఆక్రోశం ఎందుకని వెల్లంపల్లి ప్రశ్నించారు. తన సినిమాతో ప్రజల్ని దోసుకునే పవన్.. ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని అన్నారు. బెనిఫిట్ షోల పేరుతో దోచుకోవడం లేదా అని ప్రశ్నించారు. పవన్ ట్యాక్స్ ఎగ్గొట్టి..ఆ డబ్బులను ఎన్నికల్లో పంచుతున్నారని ఆరోపించారు.


జనాల జేబులు కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు. సినీ పెద్దల కోరిక మేరకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లంపల్లి చెప్పారు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ వస్తే తనకు రెమ్యునరేషన్ తగ్గుతుందని పవన్ బయపడుతున్నాడేమోనని వెల్లంపల్లి అన్నారు. పవన్‌ని పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంకి, మంత్రులకు లేదన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే పవన్ మాటలు ప్రజలు పట్టించుకోడం లేదని .. అందుకే అన్ని ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. పవన్ తక్షణమే నిన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


అంతకముందు పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. పవన్‌ స్పీచ్‌లో అనవసర విమర్శలు ఉన్నాయని ప్రభుత్వంతో నిర్మాతలు, డిస్ట్రి బ్యూటర్లు చర్చలు జరిపారని తెలిపారు. వారంతా సానుకూలంగా మాట్లాడారన్నారు. పవన్‌ రాజకీయంగా ఉన్న బాధను వెళ్లగక్కారని మల్లాది విష్ణు మండిపడ్డారు. పవన్‌ మాట్లాడిన తీరు సరిగా లేదని మల్లాది విష్ణు అన్నారు. పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరని తెలిపారు.


సినిమా ఫంక్షన్‌లో రాజకీయ మాటలెందుకని ప్రశ్నించారు. రెమ్యునరేషన్స్ కోల్పోవాల్సి వస్తుందనే ఈ అక్కసు అని ఎద్దేవా చేశారు. యాక్టర్లు రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడాలి తప్ప.. టికెట్ల గురించి వారికి ఏం సంబంధమని మల్లాది విష్ణు ప్రశ్నించారు. మంత్రి గురించి మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. అప్రజాస్వామిక దోపిడీని అరికడుతామన్నారు. బెన్‌ఫిట్‌ షో పేరు మీద దోపిడీ జరుగుతోందని.. ఆ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.