మధ్యాహ్నం 3 గంటలకు తీరం దాటనున్న గులాబ్ తుపాను

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 01:13 PM
 

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో 'గులాబ్‌ తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. ఇది గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 310 కి.మీ, కళింగపట్నానికి తూర్పుగా 380 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను గంటకు 7 కిలో మీటర్ల వేగంతో కదిలి బలపడిన తుపాను ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పైగా ఇది పశ్చిమంగా పయనిస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని , మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖపట్నం విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు సూచించారు. అంతేకాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర కలెక్టర్లను అప్రమ‍త్తం చేసినట్లు చేశామని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహాయక చర్యలు చేపట్టమని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా రానున్న రెండు రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తాంధ్రతో పాటు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌కు, తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించాంరు.