అంగన్వాడీ స్కూళ్లలో మాయాజాలం

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 06:10 PM
 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే కృతనిశ్చయంతో జనాభా ప్రాతిపదికన గ్రామాలలో అంగన్వాడి సెంటర్ లు ఏర్పాటు చేసింది. కానీ అక్కడ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది వారానికి ఒకటి రెండు రోజులు వెళుతూ అంగన్వాడీ స్కూళ్ళు మూత పడేలా చేస్తున్నారు. ఇటువంటి సంఘటన సంబేపల్లి మండలం రెడ్డి వారి పల్లి గ్రామం, ఎర్ర దిన్నెల బిడికిలో చోటుచేసుకుంది. గురువారం అంగన్వాడి సెంటర్ ను పరిశీలించగా మూత వేసి ఉంది.


ఈ విషయాన్ని గ్రామస్తులను విచారించగా వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే హాజరు అవుతారని మిగతా రోజుల్లో సెంటర్ మూసివేసే ఉంటుందని తెలిపారు. సెలవు పెట్టరు విధులకు హాజరు కారు అదేమని ప్రశ్నిస్తే వంద సాకులు చెబుతారు. అక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ వర్కరకు పని ఉంటే ఆరోజు డుమ్మా కొడతారు. సూపర్వైజర్ గాని సిడిపిఓ కు ఎటువంటి సమాచారం ఇవ్వరు. కనీసం సెలవు చీటీ గాని సమర్పించరు.


ఇది అంగన్వాడి సెంటర్ పరిస్థితి. సూపర్వైజర్, సిడిపిఓ పర్యవేక్షణ కొరవడడంతోనే వర్కర్ సక్రమంగా విధులకు హాజరుకానట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పై స్థాయి సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెడ్డి వారి పల్లి గ్రామం కె కె హరిజనవాడలో అంగన్వాడీ వర్కర్ సంసారం ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంటర్ లోనే తన ఇంటి సామాగ్రిని కుట్టుమిషన్ పెట్టుకొని సంసారం చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అంగన్వాడి స్కూల్ లో సంసారం ఉండడం ఎంతవరకు సమంజసం అని గ్రామస్తులు తెలిపారు.


ఈ విషయంపై సిడిపిఓ, సూపర్ వైజర్ వివరణ కోరగా విధులకు హాజరు కాని విషయం మాకు తెలియదని ఎటువంటి సెలవు చీటీ ఇవ్వలేదన్నారు. వర్కర్ పై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కెకె హరిజన వాడలో వర్కర్ కాపురమున్న విషయం మాకు తెలియదని ఆమెపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.