కంబాల కొండ‌.. మ‌ధురానుభూతులకు నిల‌యం

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 04:43 PM
 

కాంక్రీట్ జీవితం నుండి ఎటైనా వెళ్ళి హాయిగా గడపటానికి ప్రకృతితో సంబంధం ఉన్న ప్రదేశాలు దోహదపడతాయి. అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ .. అధిక చెట్ల సంపదను కలిగి ఉంటాయి. చెట్లు అధికంగా ఉంటె మరి అక్కడ పక్షులు కూడా అధికంగా ఉంటాయి కదా ! వాటిని చూస్తూ .. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ... మనసుకు హాయిని ఇచ్చే అటువంటి ప్రదేశాలను వెతుక్కొని మరీ వెళుతుంటారు పర్యాటకులు. మరి అటువంటి ప్రదేశమే ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నది. అదెక్కడో కాదు వైజాగ్ లోనే ఉంది.


ఆ ప్రకృతి ప్రదేశం కంబాలకొండ కంబాలకొండ వైజాగ్ సమీపంలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ ప్రాంతం ఎక్కువగా ఉష్ణమండల సతత హరితారణ్యాలు, పచ్చిక బయళ్ళు, లోయలు, కొండలు వంటి వాటితో కూడుకొని ఉన్నది.


కంబాలకొండ వన్యప్రాణి కేంద్రం 1970 నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వరంలో నడుస్తుంది. అంతకు పూర్వం ఇది విజయనగరం రాజుల అధీనంలో ఉండేది. వారు ఈ ప్రాంతంలో వేట సాగించేవారట. ఇక్కడ చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం దీనిని ఒక ఎకో టూరిజం పార్క్ గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.


ఎక్కడ ఉంది ?


జాతీయ రహదారి 5 మీద వైజాగ్ - శ్రీకాకుళం రహదారి పై, విశాఖకు ఉత్తరదిక్కున 20 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం జిల్లా పెందుర్తికి దగ్గరలో కంబాలకొండ వన్యప్రాణి కేంద్రం కలదు. కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ 71 చ.కి.మీ ల వైశాల్యంలో విస్తరించబడి ఉన్నది. అందులో 0.8 చ.కి.మీ ల స్యాంక్చురీని ఎకో టూరిజం ప్రాజెక్టు గా మార్క్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. గిరిజనుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టూరిజం స్పాట్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లేదా వైజాగ్ జూ కు అతి చేరువలో కలదు.


కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గురించి..


"కంబాలకొండ విశాఖ ప్రాంతానికి మునిమాణిక్యం వంటిది. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ అటవీ ప్రాంతంలో 80 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన ఎకో టూరిజం ప్రదేశం పర్యాటకులకు అసలుసిసలైన అనుభూతిని అందిస్తూ ఉంది. వర్షాకాలంలో వచ్చే నీటిని ఒక ట్యాంక్ లో స్టోర్ చేసి, అందులో బోటింగ్ కు అవకాశం కల్పిస్తారు. బోటింగ్ లో విహరిస్తూ అటవీ అందాలను, ఎలుగుబంట్లను చూస్తూ ఆనందించవచ్చు.


ట్రెక్కింగ్ ఎకో టూరిజం పార్క్ లో రకరకాల ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుండి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ట్రెక్కింగ్ కొరకు ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఇందులో 10 మంది సభ్యులు ఉంటారు. ఫీజు 150 రూపాయలు. లోకల్ గైడ్ గ్రూప్ కు సారధ్యం వహిస్తాడు. ట్రెక్కింగ్ కు ఒకరోజు ముందే రెసెప్షన్ వారు గ్రూప్ సభ్యులకు వివరాలు తెలియజేస్తారు.


ఈ ప్రదేశంలో చేయవలసినవి ఈ టూరిజం ప్రదేశంలో ఉన్న నెమళ్ళు, కుందేళ్లు, ఉడుతలు, పాలపిట్టల, అరుదుగా కనిపించే చిరుతలు లాంటివి పర్యాటకులు చూసి ఆనందించవచ్చు. అంతేకాక ఈ ప్రదేశంలో తనివితీరా ఆనందించాలనుకొనేవారికి రివర్ క్రాసింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ రుసుము ఎకో పార్క్ లోని ప్రవేశించాలనుకొనేవారు లోనికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి.