ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంటాడిన దురదృష్టం.. రైతుగా మారిన పైలట్‌!

national |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 03:20 PM

రూ.లక్షల్లో జీతం తీసుకోవాల్సిన ఓ పైలట్ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చేతిలో డబ్బులు లేక వ్యవసాయం చేస్తున్నాడు. యోగేష్ (34) అనే యువకుడు పైల‌ట్ కావాల‌ని కలలు కన్నాడు. కానీ పైల‌ట్ అయ్యాక తిరిగి మ‌ళ్లీ వ్య‌వ‌సాయం చేయాల్సి వ‌స్తుంద‌ని అతడు ఏనాడూ ఊహించ‌లేదు. 18 ఏళ్ల వ‌య‌స్సులో పైలట్ కావడానికి ట్రైనింగ్ తీసుకుని ఒక విమాన‌యాన సంస్థ‌లో పైల‌ట్‌గా చేరాడు. 2019 డిసెంబ‌ర్‌ లో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అధిక వేత‌న ప్యాకేజీ కోసం మ‌రో విమాన‌యాన సంస్థ‌లో చేరాల‌నుకున్నాడు. కానీ దుర‌దృష్టం అతడిని వెంటాడింది.


2020 ప్రారంభంలో క‌రోనా కారణంగా భార‌త్‌తో స‌హా ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్‌డౌన్ విధించాయి. దీని ప్ర‌భావం విమాన‌యాన రంగంపై భారీగానే ప‌డింది. ప‌లు సంస్థ‌లు పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. అలా యోగేశ్‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌ ఎయిర్‌లైన్స్ పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా దాన్ని వెనక్కి తీసుకుంది.


అంత‌కుముందు ప‌ని చేసిన ఎయిర్‌లైన్స్‌తో 10 ఏళ్లు ప‌ని చేస్తాన‌ని యోగేశ్‌ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కానీ మ‌ధ్య‌లోనే జాబ్ కు రిజైన్ చేయడంతో త‌మ‌కు ప‌రిహారం కింద రూ.58.5 ల‌క్ష‌లు చెల్లించాల‌ని స‌ద‌రు ఎయిర్‌లైన్స్‌ నోటీసు పంపింది. ఇందులో రూ.8.5 ల‌క్ష‌లు ట్రైనింగ్ ఫీజు, మిగ‌తా రూ.50 ల‌క్ష‌లు ప‌రిహారం అని పేర్కొంది. ఆ సంస్థ అప్ప‌టికీ అతడి రాజీనామాను ఆమోదించ‌లేదు. దీంతో 2020 మార్చిలో మ‌ళ్లీ పైల‌ట్‌గా సేవ‌లు ప్రారంభించాడు. క‌రోనా ప్రారంభంలో విధులు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే హౌసింగ్ సొసైటీ యాజ‌మాన్యం గూండాల‌ను పంపి అతడిని బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్టింది. అదీ కూడా కాల‌నీ వాసులంతా క‌రోనా బారిన ప‌డ్డ‌ప్పుడు జరిగింది.


బెంగ‌ళూరులో నివాసం ఉంటున్న యోగేశ్‌ త‌న భార్య‌తో క‌లిసి తన తండ్రి ఫామ్‌హౌస్‌కు బ‌స మార్చేశాడు. ఇప్పుడు ఆయ‌నకు రూ.30-35 వేల మ‌ధ్య వేత‌నం వస్తోంది. రుణ వాయిదాల చెల్లింపుల కోసం అతడు తన బైక్ ను అమ్మేశాడు. గ‌తేడాది జూన్‌లో అతడి భార్యకు గ‌ర్భ‌స్రావ‌మైంది. అది త‌మ జీవితానికి క‌ష్ట కాలం అని యోగేశ్‌ తెలిపారు.


2020 ఆగష్టు లో యోగేశ్ తో పాటు మ‌రికొంద‌రు పైల‌ట్ల‌ను యాజ‌మాన్యం తొల‌గించేసింది. దీంతో డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు. రోజూ 13-14 గంట‌లు ప‌ని చేస్తే గానీ నెల‌కు రూ.10 వేల ఆదాయం ల‌భించేది. పైల‌ట్‌గా నెల‌కు రూ.ల‌క్ష వేత‌నం అందుకున్న తాను రూ.10 వేలు మాత్ర‌మే సంపాదిస్తున్నందుకు డెలివ‌రీ ఏజంట్‌గా చేరిన‌ట్లు త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌లేద‌న్నాడు.


ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో త‌న త‌ల్లిదండ్రుల‌కు కరోనా సోకింద‌ని చెప్పాడు యోగేశ్‌. వారికి విశ్రాంతినిచ్చేందుకు పొలంలోకి దిగి ప‌ని చేయ‌డం ప్రారంభించాడు. గ‌త జూన్‌ లో ఢిల్లీ హైకోర్టు.. పైల‌ట్లంద‌రినీ తిరిగి తీసుకోవాల‌ని జారీ చేసిన ఆదేశాల‌పై యోగేశ్‌ ఆశాభావంతో ఉన్నాడు. యోగేష్ పైల‌ట్ శిక్ష‌ణ కోసం రూ.30 ల‌క్ష‌ల రుణం తీసుకున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ ఫీజు రూ.45 ల‌క్ష‌లు చెల్లించాలి. ట్రైనింగ్‌, ప‌రీక్ష ఫీజు రూ.15 ల‌క్ష‌లు క‌లిపితే మొత్తం ఖ‌ర్చు రూ.60 ల‌క్ష‌ల నుంచి రూ.కోటి వ‌ర‌కు ఉంటుంది. ఒక‌వేళ 6 నెల‌ల పాటు పైల‌ట్‌గా విధులు నిర్వ‌ర్తించ‌క‌పోతే పైల‌ట్ లైసెన్స్ రెన్యూవ‌ల్ కోసం రూ.5 ల‌క్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ యోగేశ్ చెల్లించాల్సిన అవ‌స‌రముంది. క‌నుక‌ ఈ ప‌రిస్థితుల్లో తాను పైల‌ట్‌గా ప‌ని చేసిన‌ విషయం ఎక్క‌డా బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని యోగేశ్ పేర్కొన్నాడు. ప‌రిస్థితులు మెరుగైతేనే తిరిగి త‌మ‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com