నా రాజీనామా కోరడానికి అయ్యన్నపాత్రుడు ఎవరు?: సుచరిత

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 01:56 PM
 

 ప్రజల తీర్పును తెదేపా నేతలు గౌరవించట్లేదని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్‌పై అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు సరిగా లేవని తెలిపారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ''అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్న భాష ఏంటి. తెదేపా హయాంలోనే వంగవీటి రంగాను హత్య చేశారు. రంగాను హత్య చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా?జగన్‌పై కోడి కత్తితో హత్యాయత్నం చేస్తే ఎగతాళి చేశారు. నా రాజీనామా కోరడానికి అయ్యన్న పాత్రుడు ఎవరు?సీఎం జగన్‌ ఆదేశిస్తే ఏ క్షణమైనా రాజీనామా చేస్తా.


ఇప్పుడు అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. దళిత మహిళను హోంమంత్రిని చేస్తే మీకు ఎందుకు కడుపు మంట?దిశ చట్టంపై అభ్యంతరాలు ఉంటే ప్రశ్నించండి. గతంలో తెదేపా ప్రభుత్వం మహిళలకు ఏం న్యాయం చేసింది. చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలి. మహిళల గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మా పాలన నచ్చకపోతే ప్రజలే సమాధానం చెబుతారు. హోంమంత్రిపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. మహిళలంటే ఎలాంటి భావం ఉందో అర్థం అవుతోంది. ప్రజలు ప్రతి ఒక్కటి ఆలోచించే చేస్తారు'' అని సుచరిత అన్నారు.