పెట్రో ఉత్పత్తుల పై... సామాన్యులకు మరోసారి నిరాశ!

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 11:09 PM
 

లఖ్‌నవూలో ఈ రోజు జరిగిన 45వ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‎ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు అడిగిన విధంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడంపై కౌన్సిల్ చర్చినట్లు పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్‌టీ మండలి అభిప్రాయపడినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేధించనున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


దీనితో పాటు సెప్టెంబర్ 30 వరకు వర్తించే కోవిడ్-19 సంబంధిత ఔషధాలపై రాయితీ జీఎస్‌టీ రేట్లు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించినట్లు మంత్రి ప్రకటించారు. అలాగే, క్యాన్సర్‌ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్‌ పర్మిట్‌ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు వివరించారు.