అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు ను అరెస్ట్‌ చేయాలి... వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 07:00 PM
 

అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. అనంతరం మీడియాతో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్‌లో అంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా టీడీపీకి మనుగడ లేదన్నారు.


వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ, జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. చంద్రబాబుని అరెస్ట్‌ చేయాలని డీజీపీని కోరామని ఆయన తెలిపారు.


ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. జోగి రమేష్‌పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆర్కే తెలిపారు.


చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.