ట్రెండింగ్
Epaper    English    தமிழ்

29 ఏళ్లకే రూ.7 వేల కోట్లు సంపాదించిందిలా

national |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 02:37 PM

అప్పటికి అంకితి వయసు 23. ముంబయిలో సెయింట్‌ జేవియర్‌ కాలేజీ నుంచి డిగ్రీ చేసి బెంగళూరులోని మెక్‌కిన్సే సంస్థలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తుండేది. ఆటవిడుపుగా ఉంటుందని వారాంతంలో ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాంకాక్‌ వెళ్లింది. ఆమె వెళ్లిన చతూచక్‌ మార్కెట్‌కి ప్రపంచంలోనే అతిపెద్ద వారాంతపు మార్కెట్‌గా పేరుంది. ఒకటా రెండా.. సుమారు 15 వేల దుకాణాలున్నాయక్కడ. ఎన్ని ఫ్యాషన్‌ వస్తువులు కొన్నా తనివి తీరడం లేదు. అక్కడే ఉండిపోవాలనిపించేంత బాగుందా మార్కెట్‌. బ్యాంకాక్‌లో ఆ మార్కెట్‌ మిగిల్చిన అనుభూతులని మరిచిపోలేకపోయింది అంకితి. అలాగే వాళ్లలో ఎవరికీ ఆన్‌లైన్‌ దుకాణాలుకానీ, డిజిటల్‌ పరిజ్ఞానం కానీ లేకపోవడం కూడా గమనించింది. 'ఉంటే బాగుండును' అనుకుంది మనసులో. మనదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఓ స్నేహితురాలు పిలిచిన పార్టీకి హాజరయ్యింది. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ధృవ్‌కపూర్‌ ఆమెను కలిశాడు. వాళ్లు ముచ్చటించుకోవడం మొదలుపెట్టిన కాసేపటికే ఓ విషయం వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. వాళ్లిద్దరూ ఆలోచిస్తోంది ఒక్కటే.. ఓ స్టార్టప్‌ని పెడితే ఎలా ఉంటుందని.


అనుకున్నదే తడవుగా దాచుకున్న సొమ్ముతో వ్యాపారాన్ని మొదలుపెట్టారిద్దరూ. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటో తెలుసా? ఫ్యాషన్‌ ఉత్పత్తులని అమ్మే చిరువ్యాపారస్తులకు ఆన్‌లైన్‌ వేదికని ఏర్పాటు చేయడం. అలా 2015లో 'జిలింగో' ప్రారంభమైంది. దానికి సీఈఓగా బాధ్యతలు తీసుకుంది అంకితి. అయితే ఈ సంస్థ మనదేశంలో ప్రారంభం కాలేదు. సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ఇండోనేషియాలో ప్రారంభమైంది. 'అక్కడి భాష తెలియదు. అక్కడి సంస్కృతి తెలియదు.. ఆహారపు అలవాట్లు కొత్త. అయినా అక్కడే వ్యాపారాన్ని ప్రారంభించడం ఒకరకంగా సవాలే. కానీ.. మనదేశంతో పోలిస్తే అక్కడి మార్కెట్‌ పెద్దది. స్త్రీల కొనుగోలు శక్తి ఎక్కువ. అందుకే కాస్త రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చింది. సంస్థని ముందుకు నడిపించడానికి రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడ్డా నాకు అలుపు అనిపించేది కాదు. పని చేయడం అంత ఇష్టంగా ఉండేది' అని సంతోషంగా చెబుతోంది అంకితి. అక్కడ నుంచి సరిగ్గా నాలుగేళ్లకు సంస్థని ఏడువేలకోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసే యూనికార్న్‌ క్లబ్‌లో చేర్చింది.


ఇంత చిన్న వయసులోనే వ్యాపారాన్ని అంతగా విస్తరించిందంటే ఆమె రక్తంలోనే వ్యాపార దక్షత ఉంది కాబోలు అనుకుంటే పొరపాటు. అంకితి నాన్న ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజినీర్‌. అమ్మ లెక్చరర్‌. తండ్రి ఉద్యోగరీత్యా ఒకచోట స్థిరంగా ఉండటానికి వీలుగా ఉండేది కాదు ఆమెకు. 'పెద్ద నగరాల నుంచి పల్లెటూర్ల వరకూ చాలా చోట్లకు తిరిగా. అలా తిరగడం నాకు మేలే చేసింది. దేశంలోని వివిధ సంస్కృతులు, పద్ధతులు తెలుసుకునే అవకాశం వచ్చింది. స్టార్టప్‌ని విస్తరించే క్రమంలో వివిధ ప్రాంతాల వారి అలవాట్లని తేలిగ్గా ఆకలింపు చేసుకోవడానికి ఈ అనుభవం పనికొచ్చింది. సంస్థని ప్రారంభించేముందు ఇదో యూనికార్న్‌ సంస్థ అవుతుందనే ఉద్దేశంతో మొదలుపెట్టలేదు. కేవలం ఫ్యాషన్‌ పై ఉన్న పిచ్చి అభిమానంతో మాత్రమే ప్రారంభించాను. అయితే మామూలు ఫ్యాషన్‌ ఉత్పత్తులు బ్రాండెడ్‌ వాటిని తట్టుకుని నిలబడటం అంత తేలికైన విషయం కాదని నాకు తొలినాళ్లలోనే అర్థమైంది. అందుకే అమ్మకందార్లని, వాళ్లకు ముడిసరకుని అందించే డీలర్లని, ఫ్యాక్టరీ యజమానులని, వాళ్లందరికీ అవసరం అయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ వేదికపైకే తీసుకురావాలని అనుకున్నా. అలా జిలింగోని 2017లోని బీ2బీ సంస్థగా మార్చాం' అని తన ప్రయాణాన్ని వివరించింది అంకితి. అలా ఆమె అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, ఇండోనేషియాలతోపాటు మనదేశంలోనూ సంస్థను విస్తరించారు. ఇలా గ్లోబల్‌ స్టారప్‌లని నిర్వహిస్తున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా 23 మంది మాత్రమే ఉంటే అందులో అంకితి కూడా ఒకరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com