చంద్రబాబు ఇంటిముట్టడికి వైఎస్సార్‌సీపీ యత్నం

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 01:37 PM
 

 సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. సీఎం జగన్‌పై అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌తో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద నిరసన చేపట్టాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని చంద్రబాబు ఇంటివద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో జోగి రమేశ్‌ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా.. అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.


ఈ ఘటనపై జోగి రమేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ గుండా అని మండిపడ్డారు. టీడీపీ నేతలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అన్నారు. చందబాబు కావాలనే తనపై రాళ్లు వేయించారని మండిపడ్డారు. తన కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దమ్ముంటే చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే.. లేకుంటే రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు.