డబ్బుల్లేక... తాలిబన్ ఉగ్రవాదుల ఆకలికేకలు

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 10:20 PM
 

ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశమైపోయింది కదా... ఇప్పుడు తాలిబన్ ఫైటర్లు ఎలా ఉండి ఉంటారు? ఫుల్ జోష్‌లో మెషిన్ గన్నులు పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ ఉండొచ్చని అంతా భావిస్తారు. కానీ, అక్కడ సీన్ రివర్స్‌గా ఉందట. అమెరికాలో వెలువడ్డ ఒక తాజా మీడియా రిపోర్ట్ ప్రకారం... తాలిబన్ ఉగ్రవాదులు చేతిలో డబ్బుల్లేక నానా తిప్పలు పడుతున్నట్టు సమాచారం. అంతే కాదు, కనీసం సరైన తిండి లేక ఆకలి కడుపులతో ట్రక్కుల్లోనే పడుకుంటున్నారట. తిండి, గూడు, డబ్బులు లేక రోడ్డున పడ్డారు కరుడుగట్టిన తాలిబన్ ఫైటర్స్!


ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయ్యాక హడావిడి అంతా రాజధాని కాబూల్‌లోనే కనిపిస్తోంది. కానీ, ఆ దేశ ప్రధాన నగరాలు దాటి ఇతర ప్రాంతాలకు వెళితే డబ్బు కటకట తీవ్రంగా ఉంది. సామాన్య ఆఫ్ఘానీలు ఎలాగూ స్వంత డబ్బులు కూడా బ్యాంకుల్లోంచి డ్రా చేసుకోలేకపోతున్నారు. వారితో పాటూ తాలిబన్ సైన్యంలో భాగమైన ఫైటర్లకు కూడా చాలా నెలలుగా డబ్బులు అందటం లేదట. తిండి కూడా సరిగ్గా లేక ట్రక్కుల్లోనే పడుకుని కాలం వెళ్లదీస్తున్నారని అమెరికన్ మీడియా అంటోంది. కొందరు ట్రక్కులు కూడా లేక ఎక్కడ వీలైతే అక్కడే బతికేస్తున్నారట.


ఆఫ్ఘానిస్థాన్ ఉగ్రవాదుల వశమయ్యాక ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఎక్కడికక్కడ డబ్బుని నిలిపి వేశాయి. కనుచూపు మేరలో తాలిబన్లకు ఎక్కడా అప్పులు పుట్టే అవకాశాలు లేవు. ఆ కారణంగానే తాలిబన్ ఫైటర్లు పూర్తిగా రోడ్డున పడాల్సి వస్తోంది...