ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోకియా C01 ప్లస్ స్మార్ట్​ఫోన్.. ఫీచర్స్ ఇవే

national |  Suryaa Desk  | Published : Wed, Sep 15, 2021, 02:32 PM

భారత బేసిక్​, ఫీచర్ ఫోన్ల మార్కెట్​లో గతంలో ఓ వెలుగు వెలిగిన నోకియా తర్వాతి కాలంలో ఇతర కంపెనీలకు ధీటుగా రాణించలేక పోయింది. దీంతో నోకియా ​(Nokia) ఫోన్ల​ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే భారత్​లో మళ్లీ తన బ్రాండింగ్​ను విస్తరించేందుకు నోకియా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. తక్కువ ధరలోనే బేసిక్​ స్మార్ట్​ఫోన్లను తీసుకొస్తోంది. నోకియా C01 ప్లస్ (Nokia C01 Plus) పేరిట 4జీ ఎంట్రీ లెవల్​ బడ్జెట్​ ఫోన్​ను విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్​ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్​ను అందించడం విశేషం.


నోకియా C01 ప్లస్ సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 5,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీన్ని నోకియా.కామ్, అమెజాన్‌తో సహా ఇతర ఆన్​లైన్ రిటైల్​ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. నోకియా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లతో వస్తుంది. జియో యూజర్లు 10 శాతం ఇన్​ స్టంట్​ డిస్కౌంట్​తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అంటే జియో రిటైల్ స్టోర్లు లేదా మైజియో యాప్ ద్వారా కేవలం రూ. 5,399 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.


నోకియా C01 ప్లస్ స్పెసిఫికేషన్లు


ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.45 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేను అందించారు. ఇది 1.6 గిగా హెర్జ్ యునిసోక్ SC9863a 1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్​పై పనిచేస్తుంది. డివైజ్‌లో 2 జీబీ ర్యామ్​,16 జీబీ స్టోరేజ్​ను చేర్చింది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో దీని స్టోరేజ్​ను128GB వరకు పెంచుకోవచ్చు. ఆప్టిక్స్​ విషయానికి వస్తే.. దీని వెనుకవైపు 5 మెగాపిక్సెల్ హెచ్‌డిఆర్ కెమెరా, ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించింది. ఈ రెండు కెమెరాలు LED ఫ్లాష్‌లైట్​తో వస్తాయి.


ఈ డివైజ్‌లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీన్ని రిప్లేస్​ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సాధారణ వినియోగంలో ఒక రోజంతా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్​ఫోన్​లో​ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఓఎస్​ను అందించింది. ఈ ఓఎస్​ డేటా వినియోగాన్ని 60 శాతం తగ్గించడానికి, యాప్‌లను 20 శాతం వేగంగా రన్​ చేసేందుకు ఉపయోగపడుతుంది. భద్రత కోసం, దీనిలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్​ను కూడా చేర్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com