పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 04:31 PM
 

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి కోసూరు గ్రామంలో విషాదం నెలకొంది. పని ఒత్తిడి తాళలేక కోసూరు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జంగం అనిల్ కుమార్(34) ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయన కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గచ్చిబౌలి టీసీఎస్‌లో కొన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు జంగం అనిల్ కుమార్. భార్య జ్యోతి, కుమార్తె జైష్ణ మాలికతో కలిసి చందానగర్‌లోని కైలాష్‌నగర్ ఎన్టీఆర్ అపార్ట్‌మెంట్‌లో గత నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. రోజులో అనేకసార్లు ఆఫీసు నుంచి ఫోన్లు చేస్తూ చాలా బాధ్యతలు అప్పగిస్తుండటంతో తీవ్ర మానసిక ఇబ్బందికి లోనవుతున్నాడు. కాగా, సోమవారం ఉదయం కుమార్త స్కూల్ అడ్మిషన్ కోసం భార్యభర్తలు కలిసి వెళదామని నిర్ణయించుకున్నారు.


ముందుగా అనుకున్న విధంగా పాఠశాలకు బయలుదేరుతున్న సమయంలో ఆఫీసు నుంచి టీం లీడర్ సయ్యద్ హుస్సేన్ ఫోన్ చేసి పని అప్పగించాడు. దీంతో అనిల్ స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాను పాఠశాలకు రాలేనని, నువ్వే వెళ్లి పాఠశాలలో మాట్లాడి రావాలని భార్యను కోరాడు అనిల్. దీంతో ఆమె కుమార్తెను తీసుకెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి అనిల్ కుమార్ ఫ్యానుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురైన భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటనలో మానసిక ఒత్తిడితో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలేపల్లి సత్యానారయణ(33) గూడూరు మండలం తీగలవేణి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మహబూబాబాద్ పట్టణంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇటీవల సత్యనారాయణతోపాటు అతడి తల్లిదండ్రులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకునేముందు భార్యకు ఫోన్ చేసి చెప్పారు. ఇంటికి రావాలని కోరినా వినకపోవడంతో ఆమె బంధువులతో వెళ్లి రైలు పట్టాలపై వెతికారు. కాగా, మహబూబాబాద్-తాళ్లపూసపల్లి సెక్షన్ మధ్య పిల్లిగుట్ట సమీపంలో ట్రాక్‌పై మృతి చెంది ఉన్నట్లు గుర్తించాడు. పోస్టుమార్టం అనంతరం సత్యనారాయణ మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు.