తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 02:34 PM
 

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై రాజకీయ పార్టీలు చాలా ఆశలుపెట్టుకున్నాయి. అధికారంలో ఉన్న పలు పార్టీలు ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వారి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. తాజాగా ఇదే అంశంపై మరోసారి కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా కేంద్రం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందని అడిగారు.


దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్... తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేనట్టే అని తెలిపారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచుతారు. అలాగే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు. ఇది సాధ్యమైనంత తొందరగా జరగాలని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి.