ఇన్సూరెన్స్ వస్తుందని బెంజ్ కారును తగులబెట్టిన యజమాని

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 04:15 PM
 

సొంత కారుని తగల పెట్టి ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలనే ఆలోచన అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా కటకటాల పాలు అయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 18వ తేదీ రాత్రి మండల పరిధిలోని తక్కెళ్ళపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కారు తగల పడుతుందన్న సమాచారం మేరకు సీఐ సురేష్ బాబు తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. ఏపీ09 సిజే 8402 నెంబర్ గల బెంజ్ కారు తగలపడటం చూసిన సీఐ వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులో కానీ చుట్టుపక్కల కానీ ఎవరూ లేకపోవడం గమనించిన సీఐ ప్రమాదవశాత్తు కారు తగలబడ లేదని నిర్ధారణకు వచ్చి అనుమానంతో కారు చుట్టుపక్కల గాలించగా సగం పెట్రోలు ఉన్న బాటిల్ తారస పడటంతో కారును కావాలనే తగలబెట్టినట్లుగా గుర్తించారు.


ఆ కారు ఎవరిది.. ఎవరు తగలబెట్టారు ..కారు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎందుకు తగలబెట్టారు.. ఇన్సూరెన్స్ కోసం అయి ఉండవచ్చేమో అన్న దిశగా విచారణ మొదలుపెట్టిన సీఐ సురేష్ బాబు ఎట్టకేలకు రెండు రోజుల్లోనే కేసును ఛేదించి ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా రెంటచింత మండలం రెంటాల గ్రామానికి చెందిన రవింద్రారెడ్డి పదకొండు నెలల క్రితం బెంజ్ కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేశాడని, అయితే కారు డ్రైవర్ కారు తాళాలు పోగొట్టడంతో తాళాల కోసం షోరూం చుట్టూ తిరిగినా ఫలితం లేదని, దీంతో కారును తగులబెడితే ఇన్సూరెన్స్ వస్తుందని స్నేహితుల సలహా తీసుకుని, ఈ నెల 18వ తేదిన పెదకాకాని వద్దకు కారును తరలించి కారుపై యజమాని రవీంద్రారెడ్డి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలిపారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.