బిడ్డతో సహా బావిలో దూకి గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Sat, Jun 26, 2021, 11:26 AM
 

అండగా ఉండాల్సిన భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో ఆ ఇళ్లాలు తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాను తనువు చాలిస్తే తన బిడ్డ ఒంటరి అవుతుందని చేతిలో ఓ బిడ్డ, కడుపులో మరో బిడ్డ ఉన్నా అవేవి ఆలోచించలేదు. కఠిన నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామంలో ఈ దారుణం జరిగింది.


కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల రాజేశ్వరి(28) తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఆ యువతికి తండ్రి, మేనమామలు ఏ లోటూ లేకుండా గారాభంగా పెంచి పెద్ద చేశారు. అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి రెండేళ్ల పాప భువనేశ్వరి ఉంది. రాజేశ్వరి స్థానికంగా గ్రామ వాలంటీరుగా పని చేస్తోంది. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. దంపతుల మధ్య గొడవల కారణంగా ఈనెల 23న పాపను తీసుకుని రాజేశ్వరి ఇంటి నుండి వెళ్లిపోయింది.


చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ కనిపించలేదు. ఇంతలో శుక్రవారం చిన్నమురపాక సమీపంలోని నేలబావిలో తల్లీ బిడ్డ మృతదేహాలు తేలాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి ఆ మృతదేహాలు రాజేశ్వరి, భువనేశ్వరివిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు.


రాజేశ్వరి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశాడు. అత్తింటి వేధింపులు తాళలేకే రాజేశ్వరి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుందని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని తన సోదరి తమ ముందు ఆవేదన చెందిందని రాజేశ్వరి సోదరుడు గన్నియ్య, తండ్రి సూర్యనారాయణ చెప్పారు. తన సోదరి అదృశ్యమైనప్పటి నుంచి లావేరు పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని గన్నియ్య ఆరోపిస్తున్నారు. రాజేశ్వరికి సీమంతం చేసి తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు పుట్టింటివారు ఈనెల 30న ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే దారుణం జరగడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు.