రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం..

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 14, 2021, 09:42 AM
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి గోయల్‌కి స్వాగతం చెప్పేందుకు వీఐపీ గేట్‌ గుండా వెళ్తున్న సమయంలో కేంద్ర భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఆయనను పక్కకు తోసేయడంతో మంత్రి అసహనానికి గురయ్యారు. కేంద్ర భద్రతా సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగినట్లుగా సమాచారం. ఫలితంగా ఆయన కేంద్ర మంత్రిని కలవలేకపోయారు. విషయంపై మంత్రి సీరియస్ అవడంతో విమానాశ్రయ అధికారులు స్పందించి సర్దిచెప్పి పంపించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అసలు ఏం జరిగిందంటే#8230;


రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఆ సమాయంలో ప్రొటోకాల్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడానికి రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భాగంగా విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పడానికి మంత్రి బుగ్గన వీఐపీ గేటు వద్దకు వెళ్లగా.. భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు.


 


మంత్రి ప్రవేశించే ప్రయత్నం చేయగా బలంగా వెనక్కి నెట్టడంతో కిందపడిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో.. కేంద్ర మంత్రికి వీడ్కోలు పలకలేని పరిస్థితి నెలకొంది. తనను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని విమానాశ్రయ అధికారులను రాష్ట్ర మంత్రి కోరారు. రాజేంద్రనాథ్‌రెడ్డికి విమానాశ్రయ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే మంత్రికి జరిగన అవమానంపై మంత్రి కార్యాలయం అధికారులు సీఎం కార్యాలయానికి పిర్యాదు చేసినట్లుగా తెలస్తోంది.