శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

  Written by : Suryaa Desk Updated: Thu, May 13, 2021, 02:59 PM
 

తిరుపతి, 2021 మే 13 : శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో  ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.


ఈ సందర్భంగా  తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.


ఈ కార్యక్రమంలో ఆల‌య‌ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ శ్రీ‌నివాస దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ మునీంద్ర‌బాబు, ఆలయ అర్చ‌కులు పాల్గొన్నారు.