దేశవ్యాప్తంగా లాక్‌డౌన్..ప్రభుత్వంపై ఒత్తిడి!

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 04:58 PM
 

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మానవాళిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే గడిచిన 24 గంటల్లో దేశంలో మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య సుమారు 50 దేశాలలో ఒక రోజులో కేసుల సంఖ్య కంటే ఎక్కువ. సెకండ్ వేవ్.. వేగంగా వ్యాప్తి చెందుతుండగా.. చైన్ బ్రేక్ చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాలని కోరుతున్నారు.


కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ కోసం పూర్తి లాక్‌డౌన్ అవసరంపై మరోసారి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ డిమాండ్ పెరిగిపోతుంది. లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ ఎలా కుప్పకూలిపోతుందో దేశం చూసింది, కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలు ముఖ్యం అంటూ.. పరిశ్రమల నుంచే ఈ డిమాండ్ ముందుగా వస్తుంది.


దేశంలోని అతిపెద్ద పరిశ్రమల ఛాంబర్, సిఐఐ, దేశంలో సామాన్య ప్రజల బాధలను తగ్గించడానికి ఆర్థిక కార్యకలాపాలను పెద్ద ఎత్తున పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని చిన్న వ్యాపారులు మరియు చిల్లర వ్యాపారుల సంస్థ అయిన CAIT ఇప్పటికే లాక్‌డౌన్‌కు మద్దతు ప్రకటించింది.


కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) నిర్వహించిన ఒక సర్వేలో 67.5 శాతం మంది ప్రజలు గత సంవత్సరం మాదిరిగానే జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. లాక్‌డౌన్ పెట్టకుండా కరోనా ఆగదని ప్రజలు నమ్ముతున్నారు. ఈ సర్వేలో ఢిల్లీతో సహా.. దేశంలోని 9వేల 117 మంది తమ అభిప్రాయాన్ని తీసుకున్నట్లు క్యాట్ జాతీయ అధ్యక్షుడు బిసి భారతీయ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. .


దేశంలో కరోనా అనియంత్రితంగా మారిందని 78.2 శాతం మంది చెప్పారు. ఈ సమయంలో లాక్‌డౌన్ పెట్టాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేలో అభిప్రాయం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా మహమ్మారిని ఎదుర్కోగలరని 73.7 శాతం మంది నమ్ముతున్నారు.


‘ఫుల్ లాక్‌డౌన్’ ఒక్కటే మార్గం – రాహుల్ గాంధీ


దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి పూర్తి లాక్డౌన్ మాత్రమే మార్గం అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే, దీనితో పాటు, తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.


ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది!


కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ దేశంలో అడుగు పెట్టినప్పుడు, లాక్‌డౌన్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్రంగా విమర్శించబడింది. అయితే ఈసారి ప్రభుత్వంపై ఒత్తిడి బయటి నుంచి పెరుగుతోంది. లాక్‌డౌన్ పెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, లాక్‌డౌన్ పెట్టకుండానే కరోనాను అదుపు చెయ్యాలని ప్రధాని మోడీ రాష్ట్రాలకు సూచించారు.


లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సూచనలు:


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ పెట్టే మార్గాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా కేసులను అదుపు చెయ్యడానికి ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలపై, జనసమూహాలను లేదా సూపర్ స్ప్రేడర్ వేడుకలను నిషేధించడాన్ని పరిశీలించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది.


సాధారణ ప్రజల క్షేమం దృష్టిలో ఉంచుకుని, సెకండ్ వేవ్ వైరస్ విస్తరణను నిరోధించడానికి లాక్‌డౌన్‌ను కూడా పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే మార్గాన్ని సుప్రీంకోర్టు సులభతరం చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంటుందా?


లాక్‌డౌన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆలోచించలేదు. గత నెల ప్రారంభంలో, కరోనా సెకండ్ వేవ్ వేగంగా దేశమంతా విస్తరిస్తున్నప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన ప్రసంగంలో లాక్‌డౌన్ చివరి ఎంపికగా ఉండాలని అన్నారు. ఇప్పుడు పరిస్థితి అదుపుతప్పడంతో లాక్‌డౌన్ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది