ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 30 లోపు ఈ పనులు పూర్తిచేయండి

national |  Suryaa Desk  | Published : Tue, Apr 27, 2021, 05:37 PM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వాలు పాక్షిక లాక్​డౌన్లు, నైట్​ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. తద్వారా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మనం పూర్తి చేయాల్సిన కొన్ని కీలకమైన ఆర్థిక పనులు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక అంశాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాల్సిన పనులపై ఒకసారి తెలుసుకుందాం.


ఫారమ్‌లను 15 హెచ్/15జి సమర్పించడం:


వడ్డీ ఆదాయంపై టిడిఎస్‌ను నివారించడానికి 60 ఏళ్ల లోపు వారు ఫారం15జి, 60 ఏళ్లు పైబడిన సీనియర్​ సిటిజన్స్​ ఫారం 15 హెచ్ సమర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మొత్తం ఆదాయం రూ.2.5 లక్షలోపు ఉంటే.. అతడు టిడిఎస్ మినహాయింపును కోరడానికి తన బ్యాంకులో ఫారం 15 జిని సమర్పించాల్సి ఉంటుంది. ఇది వార్షిక ప్రక్రియ. దీన్ని ప్రతి ఏటా చేయాల్సి ఉంటుంది. అయితే చాలా బ్యాంకులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫారం 15 హెచ్/15జి సమర్పించడానికి అనుమతిస్తున్నాయి. ఈ మహమ్మారి సమయంలో ఇంటి నుంచి బయటికు వెళ్లకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇప్పటికీ ఈ పని పూర్తి చేయకపోతే ఏప్రిల్ 30లోపు చేసుకోండి.


ట్యాక్స్ ప్లాన్‌ను ప్రారంభించండి:


ఏప్రిల్​ 1 నుంచి ప్రారంభమైన 2021–22 కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే పన్ను ప్రణాళికను సిద్దం చేసుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. దీని కోసం ఆర్థిక సంవత్సరం చివరి వరకు వేచి చూడకూడదని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం చివరి వారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల నష్టపోయే ప్రమాదాలు ఎక్కువని సలహా ఇస్తున్నారు. పన్ను ఆదా ప్రయోజనం కోసం ELSS నిధులలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు.. ఈ నెల నుంచే ELSS పథకంలో SIPని ప్రారంభించండి. అలా చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు.


పీఎఫ్ కంట్రిబ్యూషన్​ను మార్చండి:


ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్​పై కొత్త పన్ను నియమాలను చేర్చింది కేంద్రం. ఈ నియమాలు 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉంటాయి. సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైబడిన కంట్రిబ్యూషన్స్​పై వచ్చే వడ్డీపై ఇప్పుడు పన్ను విధిస్తారు. మీరు ఈపిఎఫ్, విపిఎస్ లేదా రెండింటి ద్వారా ప్రావిడెంట్ ఫండ్‌లో రూ .2.5 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతుంటే, దానిపై టాక్స్​ తగ్గించుకోవడానికి మీ వాటా తగ్గించమని యాజమాన్యాన్ని కోరండి.


పీపీఎఫ్ ఖాతా తెరవండి:


మీకు ఇంకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) ఖాతా లేకపోతే, త్వరగా పిపిఎఫ్ ఖాతా తెరవండి. అధిక పన్ను పరిధిలోకి వచ్చే పెట్టుబడిదారులు ప్రావిడెంట్ ఫండ్ కంటే పిపిఎఫ్​లో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని పొందగలరు. దీనిపై సుమారు 7.1% పన్ను రహిత వడ్డీ లభిస్తుంది. ఎస్‌బిఐతో సహా చాలా ప్రైవేట్ బ్యాంకులు ఆన్‌లైన్‌లో పిపిఎఫ్ ఖాతాను తెరవడానికి అనుమతిస్తాయి.


చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి:


చిన్న పొదుపు పథాకాలపై లభించే వడ్డీని తగ్గించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వచ్చే మూడు నెలల పాటు పాత వడ్డీ రేట్లే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం తాత్కాలికం మాత్రమే. వచ్చే త్రైమాసికం నుంచి తగ్గే అవకాశం ఉంది. జూలై 1 నుంచి చిన్న పొదుపు పథకాలపై రేట్లు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​, కిసాన్ వికాస్ పత్ర, ఎన్ఎస్​సీలు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ వంటి కొన్ని పథకాలలో ఇప్పుడు త్రైమాసికంలో పెట్టుబడి పెడితే, వాటి మెచ్యూరిటీ తీరే వరకు అధిక వడ్డీరేట్లను పొందవచ్చు. కాబట్టి వీలైనంత త్వరాగా చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com