కౌన్సిలర్‌ గా భార్య విజయం.. కాసేపటికే భర్త మృతి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 15, 2021, 01:37 PM
 

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన విషయం తెలిసిందే. కౌన్సిలర్‌గా విజయం సాధించిన కొద్దిసేపటికే ఒక మహిళ తన భర్తను కోల్పోయింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అమలాపురం మున్సిపాలిటీలోని 10వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా కొల్లాటి నాగవెంకట దుర్గాబాయి బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే ఆమె భర్త, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆ బాధతోనే ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. అయితే శనివారం తెల్లవారుజామున ఆమె తల్లి మరణించారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.


ఇక, ఆదివారం ఆమె బాధను దిగమింగుకుని అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కౌంటింగ్‌ హాలుకు వెళ్లారు. ఆమె గెలిచినట్టు తెలియడంతో.. అంతా ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. అయితే అంతలోనే ఆస్పత్రిలో ఉన్న ఆమె భర్త చనిపోయినట్టు సమాచారం అందింది. దీంతో ఆమె మరింత విషాదంలోకి వెళ్లిపోయింది. భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఏవండీ.. లేవండీ.. ఎన్నికల్లో నేను గెలిచాను.. నన్ను ఆశీర్వదించండి. మీరిచ్చిన ధైర్యమే నాకు అండండీ.. అంటూ విలపించింది. దుర్గాబాయి దీన గాథను చూసి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా స్థానిక ప్రజలు చలించిపోయారు.