వివాహేతర సంబంధం.. కూతురిని చంపిన తండ్రి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 15, 2021, 12:18 PM
 

పరువు కోసం ఓ తండ్రి తన కన్న కూతురినే చంపేశాడు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లె పట్టణం గాండ్ల వీధిలో జరిగింది. పోరుమామిళ్ల వనజారాణి (29), గురువేంద్ర దంపతులకు 2009 లో వివాహమైంది. వారి కూతురు గురు పూజిత మూడో తరగతి చదువుతోంది. గురువేంద్ర బతుకుదెరువు కోసం దుబాయ్ ‌కి వెళ్లాడు. వనజారాణి తన తల్లిదండ్రుల వద్ద ప్రొద్దుటూరులో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఏడాది జనవరిలో ఆమె భర్త దుబాయ్‌ నుంచి తిరిగొచ్చాడు.


అప్పటి నుంచి ఆమె తన భర్తతో తనకు విడాకులు ఇవ్వాలని, మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనిపై వారి మధ్య గొడవ జరుగుతోంది. ఈ విషయాన్ని గురువేంద్ర వనజారాణి తల్లిదండ్రులకు చెప్పాడు. తమ కూతురికి నచ్చజెప్పాలని వారిని కోరాడు. వనజారాణి తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్థన్, మరొకరు శనివారం రాత్రి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంతకీ ఆమె వినిపించుకోకపోవడంతో చున్నీని ఆమె మెడకు చుట్టి హత్య చేశారు. పోలీసులు వారిపై ఆదివారం కేసు నమోదు చేశారు.