క్లాస్ రూమ్ లో కొట్టుకున్న లెక్చరర్లు..పగిలిన తలలు

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 26, 2021, 05:12 PM
 

తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు లెక్చరర్లు రెచ్చిపోయారు. క్లాస్‌రూమ్‌లోనే ఒకరినొకరు కొట్టుకున్నారు. ఉపాధ్యాయులు వీధి రౌడీల్లా తరగతి గదిలోనే కొట్లాటకు దిగడంతో అది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే అనపర్తి శివారు కొత్తూరులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఇంగ్లీష్ మీడియం గురుకుల జూనియర్‌ కాలేజీలో వెంకటేశ్వరరావు ఎనిమిదేళ్లగా పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు కొంత మంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు టెట్‌ పరీక్షలకు హాజరుకాలేదని ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుతో పాటు మరో లెక్చరర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కాలేజీలో జరుగుతున్న విషయాలు వెంకటేశ్వరరావు ఉన్నతాధికారులకు చెప్పడంతో.. వారు శ్రీనివాసరావును వివరణ కోరారు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు క్లాస్‌రూమ్‌లోనే ఘర్షణకు దిగారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలుకాగా విద్యార్థులు, తోటి అధ్యాపకులు విడదీసి అనపర్తిలో ఆస్పత్రికి తరలించారు. అధికారులు ఈ గొడవకు సంబంధించి విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెక్చరర్లు ఇలా క్లాస్‌రూమ్‌లోనే కొట్టుకోవడం కలకలంరేపింది.