అనంతపురం జిల్లాలో దారుణం.. పెళ్ళైన నెలకే గర్భం దాల్చిందని..

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 05:31 PM
 

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అత్తింటి వేధింపులు ఒకవైపు...భర్త అనుమానం జబ్బుకి కాబోయే వైద్యురాలు బలైంది. పెళ్ళైన నెలకే గర్భం దాల్చడంతో ఆమెకు భర్త, అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం అనుమానాస్పద రీతిలో ఆమె మృతి చెందింది. అత్తింటివారు తమ కూతురిని హత్య చేసారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా హిందూపురం మడకశిరకు చెందిన అక్తర్ జాన్ కుమార్తె ఆర్షియా(26) వైద్య విద్య చదువుతుంది. ఇంతలోనే కూతురికి పెళ్లి చేయాలనీ ఆమె తల్లిదండ్రులు భావించారు. హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నూరుల్లాతో పెళ్లి నిశ్చయించారు. 5 లక్షల కట్నం, అర కేజీ బంగారు ఆభరణాలు ఇచ్చి 2019లో ఘనంగా పెళ్లి చేసారు. అయితే పెళ్ళైన నెలకే ఆర్షియా గర్భం దాల్చింది. దీంతో భర్త అనుమానంతో ఆమెను వేధించాడు. అతని కుటుంబంతో కలిసి అదనపు కట్నం తేవాలన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతో ఆర్షియా తీవ్ర ఆవేదనకు గురైంది.
మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు ఆమె చాలా ముభావంగా ఉంది. తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేసింది. మరుసటిరోజే హిందూపురంలో ఉండే బంధువులు ఫోన్ చేసి మీ కూతురు లేవడం లేదని చెప్పారు. హుటాహుటిన ఆర్షియా తల్లి, సోదరుడు అక్కడకు వెళ్లి చూడగా ఇంటి పై కప్పుకి ఉరి వేసుకుంది ఆమె భర్త నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తమ కూతురికి న్యాయం చేయాలని తల్లి, మృతురాలి సోదరుడు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది.