తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న ముప్పు..బీ అలర్ట్

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 05:15 PM
 

నివర్‌ తుఫాన్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇకపోతే ముఖ్యంగా ఏపీలోని ఆరు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 177 ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు రికార్డు అయినట్టు అధికారులు చెప్తున్నారు. నెల్లూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. వెంకటగిరి మండలం ఏపీటీఎఫ్‌ కాలనీలో అత్యధికంగా 304 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కడప జిల్లా సంబేపల్లిలో అత్యల్పంగా 64.5 మిల్లీ మీటర్ల వర్షం రికార్డు అయ్యింది.
ఇక నెల్లూరు జిల్లాలోని 09 ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని 72 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురవగా.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని 96 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. ఏపీలోకి డీప్ డిప్రెషన్‌గా మారి చిత్తూరు జిల్లాలోకి నివర్ తుఫాన్‌ ప్రవేశించినట్టు అధికారులు వెల్లడించారు. చిత్తూరు, నెల్లూరు, అనంత, కడప జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని.. రానున్న 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. 4 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు.. మరో 24 గంటల పాటు నివర్ ప్రభావం ఏపీపై ఉంటుందన్న ఆయన.. పంటలకు నష్టం జరగకుండా వీలైనంత మేర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్‌ తీవ్రత తగ్గిన తర్వాత నష్టంపై అంచనా వేస్తామన్న ఆయన.. సముద్రంలోకి జాలర్లు ఎవ్వరూ వెళ్లలేదని తెలిపారు.
నివర్ తుపాను రాగల 6 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారి ఆ తర్వాత బలహీనపడే అవకాశం ఉందన్నారు. నివర్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు..అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కమిషనర్ సూచించారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని హితవు పలికారు. మరోవైపు నివర్ తుఫాన్ కారణంగా తెలంగాణాలోనూ ఓ మోస్తారు వర్షాలు కురుయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నివర్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇకపోతే నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం మేఘామృతమై ఉండటం కారణంగా అక్కడక్క ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.