ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు రద్దు కాలేదు

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 04:42 PM
 

తమిళనాడు, ఏపీ లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే గురువారం రోజు ప్రయాణించాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే రద్దు చేసిన జాబితాలో హైదరాబాద్-తాంబరం మధ్య నడిచే రెండు స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ రైళ్లను రద్దు చేయట్లేదని, ప్రయాణికులకు సేవలు అందిస్తుందని సదరన్ రైల్వే తెలిపింది. రైలు నెంబర్ 02760 తాంబరం నుంచి హైదరాబాద్‌ మధ్య సేవలు అందిస్తుంది. తాంబరంలో సాయంత్రం 5.10 గంటలకు రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్‌ లో ఆగుతుంది. ఇక రైలు నెంబర్ 02759 హైదరాబాద్ నుంచి తాంబరం మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు హైదరాబాద్‌లో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట జంక్షన్‌, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రైళ్లు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ రెండు రైళ్లు ఆ తర్వాత అందుబాటులో ఉంటాయో లేదో ఇంకా ప్రకటించలేదు.