హీట్ పుట్టిస్తున్న తిరుపతి ఉప ఎన్నిక సమరం

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 04:08 PM
 

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కాలం అయిన నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునే అవకాశం లభిస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వ్యవధి దాదాపు రెండు నెలలు పైగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఉప ఎన్నిక బరిలో తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉండనున్నారు. దీంతో రంగంలో ఎందరో అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా చతుర్ముఖ పోటీ నెలకొని ఎన్నిక రసకందాయంగా మారనుంది.
ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవనుంది..? ప్రజలు ఏవరికి పట్టం కట్టనున్నారు..? అనే తదితర విషయాలపై నేడు లోకల్ యాప్ ప్రత్యేకం కథనం.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వస్తాయి.నియోజకవర్గం పరిధిలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటర్ల జాబితా సవరణకు ప్రకటన వెలువడింది. తుది జాబితా జనవరిలో వస్తుంది. అప్పటికి ఓటర్ల సంఖ్య మరింత పెరగనుంది.
గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో తిరుపతి లోక్ సభ అ స్థానంతో పాటు దీని పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ గెలుచుకుంది. అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వివిధ అంశాలపై పోరాటాన్ని తీవ్రతరం చేసింది. స్వల్ప కాలంలోనే వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత తెచ్చుకుందని తెలుగుదేశం భావిస్తోంది. అందుకే చివరి వరకు సాగదీయకుండా అభ్యర్థిని ప్రకటించేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మి అభ్యర్థిగా ఖరారు చేసింది.
ఇక ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ పెద్ద కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ దిశగా వైసీపీ అధిష్టానం ఆ కుటుంబానికి సంకేతాలు ఇస్తోంది. ఇక బిజెపి, జనసేన పొత్తు నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిని దించనున్నాయి. అయితే, బిజెపి నాయకులు తమ అభ్యర్థి రంగంలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై జనసేన ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చింతా మోహన్ పోటీ చేయనున్నారు. దీంతో తిరుపతి  ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది.దీంతో ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.