ఏపీలో నేటి నుంచి రూ.40కే ఉల్లి..

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 23, 2020, 09:33 AM
 

ఏపీలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. పలుచోట్ల కిలో ఉల్లి ధర రూ.100 రూపాయలకు పైగా పలుకుతుండటంతో ప్రభుత్వ అప్రమత్తమైంది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా మరోసారి సబ్సిడీ ఉల్లిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.40 లకే విక్రయించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ రూ.40లకే కిలో ఉల్లిని అందించనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉల్లి పంట దెబ్బతినడం, మార్కెట్లో మండిపోతున్న రేట్లను దృష్టిలో ఉంచుకుని సబ్సిడీ ధరకే ఉల్లిని విక్రయించాలని నిర్ణయించినట్లు కన్నబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉల్లి కొరత కారణంగా రైతు బజార్లలో ఎక్కడా ఉల్లిపాయలు కనిపించడం లేదు. రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించిన ఉల్లిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి వ్యాపారులు, దళారులు కలిసి సొమ్ము చేసుకుంటున్నారు.


రైతు బజార్లలో కనిపించని ఉల్లిపాయలు సాధారణ మార్కెట్లలో మాత్రం విపరీతమైన ధర పలుకుతున్నాయి. దీంతో కిలో 30 నుంచి 40 రూపాయలకు కొనుక్కుని వాటిని బ్లాక్‌లో వంద రూపాయల మేర విక్రయిస్తున్నారు. దీనిపై ముందే సమాచారం ఉన్నా మార్కెటింగ్‌ శాఖ దాడులు నిర్వహించకపోవడంతో ఎప్పటిలాగే ఉల్లి ధర కొండెక్కుతోంది. దీంతో సాధారణ జనానికి ఈ సీజన్‌లోనూ ఉల్లి కష్టాలు తప్పేలా లేవు. రైతు బజార్లలో విక్రయించే ఉల్లికి ఆధార్‌ కార్డులు అడిగే పరిస్ధితి ఉండటంతో అక్కడికి వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు.