ఈఎంఐల రూపంలో చెల్లించేందుకే కస్టమర్ల మొగ్గు

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 21, 2020, 05:18 PM
 

ఓ వైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, మరోవైపు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్... ఇండియాలో ఆన్ లైన్ పండగ సీజన్ అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. గతంతో పోలిస్తే ఆన్ లైన్ అమ్మకాల్లో పూర్తిగా డబ్బు చెల్లించి, వస్తు ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు వస్తువు తీసుకుని, తరువాత డబ్బును ఈఎంఐల రూపంలో చెల్లించేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు నిదర్శనం, అమెజాన్, తన పండగ అమ్మకాల్లో భాగంగా 24 గంటల వ్యవధిలో రూ.600 కోట్ల విలువైన క్రెడిట్ ను కస్టమర్లకు ఇవ్వడమే.
తదుపరి చెల్లించే విధానంలోనే అమ్మకాలు అధికంగా సాగుతున్నాయని, ఈఎంఐ విధానంలో గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు టైర్ 2, టైర్ 3 నగరాల వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని అమెజాన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. "ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా ఈఎంఐ స్కీమ్ ను అమలు చేస్తున్నాం. కస్టమర్లకు స్నేహపూర్వకంగా వస్తువులను అందించాలని నిర్ణయించాం. ప్రతి మూడు గృహోపకరణాల్లో ఒకటి ఎయిర్ కండిషనర్ అమ్మకమే సాగుతోంది. ఇప్పటికే 3.5 లక్షల ఫ్రిజ్ లను ఈఎంఐ విధానంలో విక్రయించాం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ విజయవంతమైంది. ఇందుకోసం 24 బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం" అని ఆయన తెలిపారు.
ఇక అమెజాన్ కు పోటీగా ఉన్న ఫ్లిప్ కార్ట్, తన బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా, ప్రతి ఐదు ఉత్పత్తుల్లో ఒక స్మార్ట్ ఫోన్ ను విక్రయించినట్టు వెల్లడించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కూడా భారీగానే విక్రయించామని, ఈఎంఐ విధానంలో అమ్మకాలు 2019తో పోలిస్తే 65 శాతం వృద్ధి చెందాయని స్పష్టం చేసింది. గృహోపకరణాల అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని నమోదు చేశామని సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
"కరోనా మహమ్మారి కారణంగా మొబైల్స్, ల్యాప్ టాప్స్ ప్రజలకు నిత్యావసరాలుగా మారిపోయాయి. మా మొబైల్ కేటగిరీలో బీబీడీలో భాగంగా 22 శాతం వృద్ధిని కళ్లజూశాం. ఎక్స్ఛేంజ్ అమ్మకాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి" అని ఆయన తెలిపారు. ఇప్పుడు కొనుగోలు చేసి, తదుపరి చెల్లింపు చేసే విధానంలో అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 1.5 రెట్లు పెరిగాయని, నో కాస్ట్ ఈఎంఐ విధానంలో బజాజ్ ఫిన్ సర్వ్ సహా వివిధ బ్యాంకులతో తాము డీల్స్ కుదుర్చుకున్నామని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.