నితిన్ గడ్కరీతో కలిసి విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన జగన్

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 16, 2020, 12:53 PM
 

విజయవాడ వాసులు ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం జరిగింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్‌లు వర్చువల్ ద్వారా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభంతో పాటు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో క‌లిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు.2.6 కి.మీల పొడవున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ.502 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా రూ.355.8 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.146.2కోట్లు ఖర్చు చేసింది. 900 రోజుల్లో ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం పూర్తి కావడంతో అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ఘనతను దేశానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీడియోను రూపొందించింది.