ఏడాదిగా భార్యను టాయ్‌లెట్‌లో బంధించి..

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 15, 2020, 01:45 PM
 

కట్టుకున్న భార్యను ఏడాదిగా మరుగు దొడ్డిలో బంధించిన భర్త ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లా రిష్పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు మహిళ, శిశు సంరక్షణ అధికారులకు సమాచారం అందించడంతో ఆమెను కాపాడారు. ఏడాది పాటు పాయిఖానాలో బందీగా ఉన్న ఆమె పరిస్థితిని చూసి అధికారులు సైతం చలించిపోయారు. బలహీనంగా ఉన్న ఆమెను చికిత్స ని​మిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా,కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు నరేష్‌ కుమార్‌తో మహిళకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ అధికారణి రజనీ గుప్తా మాట్లాడుతూ, ‘ఒక మహిళను టాయిలెట్‌లో  ఏడాది పైగా బంధించి ఉంచినట్లు మాకు సమాచారం అందింది. మా బృందంతో కలిసి వెంటనే ఇక్కడకు చేరుకున్నాం. ఆమె పరిస్థితి చూస్తే చాలా రోజులుగా ఆమె ఏమీ తినలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై ఆమె భర్తను ప్రశ్నించగా భార్యకు మానసిక స్థితి సరిగా లేదని చెప్పాడు. అయితే అది వాస్తవం కాదని మాకు అర్థమైంది. ఆమె మానసిక స్థితి బాగానే ఉంది.’  అని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  ఇక ఈ విషయంపై బాధితురాలి భర్త నరేష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘నా భార్య మానసిక పరిస్థితి బాగోలేదు. మేం ఆమెను ఇంట్లోకి రమ్మని చెబుతున్నా.. ఆమె టాయ్‌లెట్‌ నుంచి ఎప్పుడు బయటకు రాదు. ఆమె మానసిక స్థితిపై డాక్టర్‌కు కూడా చూపించాం. అయినా ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు’ అని పేర్కొన్నాడు.