అలాంటి వ్యవస్థలపై దమ్ము, ధైర్యంతో స్పందించాల్సిన అవసరం ఉంది :మంత్రి కొడాలి నాని

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 02:36 PM
 

తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో పెట్టిందిపేరైన ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తనదైన శైలిలో స్పందించారు. వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని రాజ్యాంగంలో ఉందని, కానీ కొన్ని వ్యవస్థలను వాటిలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. తమ మాటే వినాలని, తాము చెప్పిందే పాటించాలని, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలను తాము ఏమైనా చేయగలమని కొన్ని వ్యవస్థలు అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి వ్యవస్థలపై దమ్ము, ధైర్యంతో స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.


జగన్ సీఎంగా వచ్చాక జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ ప్రజలకు కూడా అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రకటన రాకముందే చంద్రబాబు బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని, దీనిపై సీఎం జగన్ చిత్తశుద్ధితో విచారణకు ఆదేశించారని తెలిపారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించకపోవడంతో సీఎం జగన్ స్వయంగా సిట్, సీఐడీ విచారణకు ఆదేశించాల్సి వచ్చిందని వివరించారు.


కానీ టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసి అడుగడుగునా అడ్డంపడుతున్నారని, పార్లమెంటులోనూ ఇద్దరు ముగ్గురు ఎంపీలను అడ్డంపెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సీఎం జగన్ దమ్ము, ధైర్యంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను కొడాలి నాని ఆకాశానికెత్తేశారు. ఎదుటివారు ఎంతటి వాళ్లయినా ఢీకొట్టే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగన్ అని, జగన్ వంటి నేత గతంలోలేడని, ఇకముందు వస్తాడో రాడో తెలియదని అన్నారు.


"గతంలో నేను ఎన్టీఆర్ వద్ద పనిచేయలేకపోయాను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేయలేకపోయాను. జగన్ వద్ద మంత్రివర్గంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఒక మగాడి వద్ద, ఒక నిజాయతీపరుడి వద్ద, అవతల కొండలు ఉన్నా ఢీకొట్టగల ధీశాలి వద్ద పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నా. పైనున్న దేవుడ్ని, కింద ఉన్న ప్రజల్ని నమ్మి షంషేర్ లా ముందుకు వెళ్లే నాయకుడు జగన్. దేశ చరిత్రలో ఇలాంటి నాయకుడు మరొకరు లేరు" అంటూ వేనోళ్ల కీర్తించారు.