రూ.80 లక్షల విలువైన ఫోన్లు దోచేసిన దుండగులు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 16, 2020, 08:31 PM
 

గుంటూరు-మంగళగిరి జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది. ఓ కంటెయినర్ నుంచి రూ.80 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ నుంచి కోల్ కతాకు మొబైల్ ఫోన్లను ఓ కంటెయినర్ లో తరలిస్తున్నారు. ఆ కంటెయినర్ మంగళగిరి సమీపంలోకి వచ్చిన సమయంలో ఓ వాహనదారుడు కంటెయినర్ వెనుక భాగం తెరిచి ఉన్నట్టు గుర్తించాడు. ఆ విషయాన్ని కంటెయినర్ డ్రైవర్ కు తెలిపాడు. దాంతో వాహనం ఆపిన కంటెయినర్ డ్రైవర్ వెనుకభాగంలో పరిశీలించగా, చోరీ జరిగినట్టు వెల్లడైంది.ఈ నేపథ్యంలో కాజ టోల్ గేట్ వద్ద కంటెయినర్ ను నిలిపి, మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన, మధ్యప్రదేశ్ కు చెందిన ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.