ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పై విమర్శలు చేసిన నారా లోకేష్...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 03:40 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సీఎం జగన్ తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిరోజు పదివేలకు పైగా కొత్త కేసులు, 100 మరణాలు సంభవిస్తున్నాయని, కానీ కరోనా బాధితులు వైద్యం అందక ప్రాణాలు రక్షించమని వేడుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఒక్క చాన్స్ ఇచ్చిన తర్వాత ఎన్నెన్ని దుర్మార్గాలు చేశారో మహాప్రభో అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. దుర్ముహూర్తం ఎంచుకుని మరీ ప్రజావేదిక కూల్చేశారని ఆరోపించారు. వికేంద్రీకరణ అనే అందమైన మాట వెనుక ఎంత విషం చిమ్మారు జగన్మోసకారా అంటూ విమర్శించారు.


"ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 21వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దానికి ఉచిత ప్రయాణ వసతి కల్పించిన మహాఘనత మీకే దక్కుతుంది. లేకపోతే, 600 ఏళ్ల వెనక్కివెళ్లి ఢిల్లీ నుంచి రాజధాని దౌలతాబాద్ కు ఎలా తరలి వెళ్లిందో, ప్రజలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో చరిత్రలో చదవడమే తప్ప వాస్తవంలో అనుభవంలోకి వచ్చి ఉండేదా?" అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలపై కక్ష తీర్చుకున్నారని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేయడమే కాకుండా, ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు కూడా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు.


సన్నబియ్యం హామీ నిలబెట్టుకోలేక పోగా, 18 లక్షల రేషన్ కార్డులు తొలగించారని విమర్శించారు. 15 నెలల కాలంలో 400 అత్యాచార ఘటనలు జరిగాయని, దిశ చట్టం, ఈ-రక్షాబంధన్ అంటూ ప్రచార వ్యామోహం తప్ప క్షేత్రస్థాయిలో జరిగిన న్యాయం ఏదీ? అంటూ ప్రశ్నించారు. నాటు సారా, శానిటైజర్ తాగి ప్రజలు చనిపోవడం కూడా సర్కారు హత్యలేనని, జే ట్యాక్స్ వసూళ్ల కోసం చెత్త బ్రాండ్లతో ప్రజల రక్తం తాగుతూ రూ.25 వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని, ఎంతో భవిష్యత్ ఉన్న ప్రసాద్ అనే దళిత యువకుడు నక్సల్స్ లో చేరాలనుకునే పరిస్థితి తీసుకువచ్చారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మీ అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీం కోర్టు 70కి పైగా కేసుల్లో మొట్టికాయలు వేయాల్సి వచ్చిందని, ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలిసిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ధ్వంసం చేయాలన్న ప్రతీకార ధోరణి తప్ప ఈ 15 నెలల్లో మీకు ఒక్క మంచి ఆలోచన అయినా వచ్చిందా? అంటూ నిలదీశారు. ఒక్క చాన్సు ఇచ్చి ప్రజలు మోసపోయారు... ఒకసారి చేతులు కాలాయి కాబట్టి ఈసారి జాగ్రత్తపడతారు... ఇక మీ మోసాలు సాగవు" అంటూ నారా లోకేశ్ స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com