ఏపీలో ఆ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 14, 2020, 07:44 PM
 

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతబడ్డాయి. తరగతులు, అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న అంశంపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ తరగతులే ఉత్తమ మార్గమన్న అభిప్రాయం విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో సైతం బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల్ని నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఆగస్ట్ 17న ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. గతంలోనే ఈ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి క్లాసులు నిర్వహించనున్నారు. బీటెక్, బీఫార్మసీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల విద్యార్థులు ఈ ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకావచ్చు. ప్రస్తుత 2020-21 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కాకుండా ఇప్పటికే బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-ఏఐసీటీఈ అన్ని విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇచ్చింది.దీంతో జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏ విద్యార్థులకు ఆగస్ట్ 17 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నాయి. రెగ్యులర్ తరగతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తుది పరీక్షల్ని కూడా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయాలు ఆలోచిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పరీక్షలు మొదలుకానున్నాయి. సెమిస్టర్ పరీక్షల్ని జంబ్లింగ్ విధానం లేకుండా బ్యాచ్‌ల వారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.