వారికి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 14, 2020, 07:37 PM
 

మీ ఆదాయం నెలకు రూ. 15 వేల లోపే ఉందా. రిటైర్మెంట్ తర్వాత ఎలా బతకాలని బెంగతో ఉన్నారా? అయితే కేంద్రం అందస్తున్న ఈ పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెల రూ. 3 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 36 వేలు. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ స్కీమ్ పేరు పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ యోజన. ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరిన వారు నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్యలో ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ వయసు ప్రాతిపదికన మీరు చెల్లించే మొత్తం కూడా మారుతుంది.18 ఏళ్ల వయసులోనే ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. 30 ఏళ్ల వయసులో పథకంలో చేరితే మీరు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.200 కట్టాల్సి ఉంటుంది. ఇలా 60 ఏళ్ల వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మీకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. మీరు 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఈ స్కీమ్‌లో చేరితే మీరు మొత్తంగా రూ.27,720 చెల్లిస్తారు. 60 ఏళ్ల తర్వాత నుంచి మీరు జీవించి ఉన్నంత కాలం మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరాలని భావించే వారు సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి స్కీమ్‌లో చేరొచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్ అకౌంట్ వంటి ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు శ్రమ యోగి కార్డు కూడా వస్తుంది. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈఎస్ఐ తదితర పథకాల్లో ఉన్న వారు ఈ పథకంలో చేరేందుకు అవకాశం లేదు.