కరోనాపై మీ సందేహాలు.. డాక్టర్ సమాధానాలు.

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:20 PM
 

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తుమ్మితే కరోనా వచ్చినట్లేనా? దగ్గితే కరోనా ఉన్నట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరుకు చెందిన రహమత్ నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్.షేక్ ఖాజా పీర్ గారి నుంచి సమాధానాలు అందిస్తున్నాం. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే వాటిని కామెంట్ల రూపంలో పోస్టు చేయండి.


ప్రశ్న: సార్ నాకు కరోనా సోకినట్లు నిర్దారణ జరిగి 14 రోజులు అవుతోంది. నేను ఇప్పుడు బయట తిరగొచ్చా?


జవాబు: మరోసారి పరీక్షలు చేయించుకోండి. నెగటివ్ వస్తే తిరగొచ్చు.


ప్రశ్న: కరోనా ఉంటే ఎన్ని రోజులకు తెలుస్తుంది సార్?


జవాబు: మూడు నుంచి వారం రోజులు పడుతుంది. కొందరికి 14 రోజులు కూడా పట్టొచ్చు.


ప్రశ్న: సార్ నేను కరోనా పేషెంట్ కు మూడు మెట్ల దూరంలో నిల్చున్నారు. అతను, నేను ఇద్దరం మాస్కు ధరించాం. ఏమైనా సమస్య అంటారా?


జవాబు: మూడు మెట్లు అంటే దాదాపు మీటరు ఉండొచ్చు. ఇద్దరు మాస్కు ధరించారు కాబట్టి ఇబ్బంది ఉండదు.


ప్రశ్న: సార్ నాకు కరోనా వచ్చింది. ఏ లక్షణాలు లేవు. కానీ ఒక్క దగ్గు మాత్రమే ఉంది. అస్సలు తగ్గడం లేదు?


జవాబు: దగ్గు తగ్గడానికి కాస్త సమయం పడుతుంది. భయ పడకండి. డాక్టరు సూచించిన మందులు వాడండి.


ప్రశ్న: సార్ రెండు రోజులుగా వాసన పసిగట్టలేకపోతున్నా. కరోనా అంటారా?


జవాబు: కేవలం వాసన పసిగట్టకపోవడాన్ని కరోనాగా చెప్పలేం. జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది తదితర లక్షణాలు కూడా కనిపిస్తే అనుమానించవచ్చు.


ప్రశ్న: కరోనా వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?


జవాబు: జ్వరం వచ్చి తగ్గకపోవడం, శ్వాసలో ఇబ్బంది, దగ్గు, జలుబు, వాసన గుర్తించకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిది


 


ప్రశ్న: సార్ నాకు దగ్గు, జలుబు ఉంది. ఎంతకూ తగ్గడం లేదు?


జవాబు: వాతావరణ మార్పుల వల్ల కావొచ్చు. ఇతర లక్షణాలు కూడా కనిపిస్తేనే కరోనా గురించి ఆలోచించండి.


 


ప్రశ్న: సార్ నాకు కరోనా వచ్చి తగ్గిపోయింది. కరోనా వచ్చిన వాళ్లలో రక్తం చిక్కపడుతుంది అంటున్నారు. ఏదైనా ప్రాబ్లమా? పలచబడడానికి ఏమైనా మందులు వాడాలా?


జవాబు: కరోనా వస్తే రక్తం చిక్కపడడం లాంటిది ఏమీ ఉండదు.


 


ప్రశ్న: నాకు ఛాతిలో మంటగా ఉంది. కొంచెం నీరసంగా ఉంది. నాకు గ్యాస్ సమస్య ఉంది?


జవాబు: గ్యాస్ వల్లనే కావొచ్చు. భయపడకండి.


 


ప్రశ్న: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొంచెం జ్వరం ఉంది. కరోనా అంటారా?


జవాబు: జ్వరం పెరిగి ఎంతకూ తగ్గకపోవడం తదితర ఇతర కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి