కరోనా రోగి శవాన్ని పీక్కుతిన్న కుక్కలు..వెలుగులోకి నిజాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 12, 2020, 07:15 PM
 

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఒంగోలు జీజీహెచ్‌లో ఓ వ్యక్తి శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన మంగళవారం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టిఒఐ కథనం మేరకు..సదరు వ్యక్తి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంటకు చెందిన రిటైర్డ్ వీఆర్ఏ అని తెలిసింది. కరోనా బారిన పడి ఒంగోలు జీజీహెచ్‌లో చేరిన ఆయన చివరకు దారుణంగా మరణించారు. బిట్రగుంటకు చెందిన ఇత్తడి కాంతారావు (60) రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ నెల 5వ తేదీన గ్రామంలో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు ఇంట్లోనే ప్రత్యేక గది ఉందని, హోం క్వారంటైన్‌కు అనుమతించాలని అధికారులు, వైద్యులను వేడుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేసే పంచాయతీ, వైద్య సిబ్బంది ససేమిరా అన్నారు.ఒంగోలు రిమ్స్‌కు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. చేసేది లేక అయిష్టంగానే అంబులెన్సు ఎక్కి ఒంగోలు రిమ్స్‌కు వచ్చారు. ఒంగోలు తీసుకెళ్లిన కాంతారావు ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, తాము వైద్యులతో మాట్లాడుతూనే ఉన్నామంటూ సిబ్బంది భరోసా ఇస్తూనే ఉన్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం లేని కాంతారావు కుటుంబీకులు నిజమే చెబుతున్నారని నమ్మేశారు. అయితే ఒంగోలు రిమ్స్‌ ఆవరణలో కరోనా మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు అని పత్రికల్లో వార్తలు వచ్చాయి. తీరా చూస్తే ఆ మృతదేహం కాంతారావుది. దీంతో ఆయన కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. చనిపోయి, మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినేదాకా జీజీహెచ్‌లో గుర్తించలేకపోవటమే దారుణమని వాపోయారు. కాంతారావు కుటుంబంలో శోకసంద్రం నెలకొంది.