ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలను కించపరచకుండా సినిమాలు తీయడం సాధ్యం కాదా..?: అన్నపూర్ణ సుంకర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 07:11 PM

మహిళలను కించపరచకుండా సినిమాలు తీయలేరా..? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమాల్లో కూడా అమ్మాయిలను అవమానించే సీన్‌లు ఉండాల్సిందేనా..? సినిమాల్లోని మహిళలను ఒద్దికగా, అమాయకంగా ఉండే విధంగానే ఎందుకు చిత్రీకరిస్తారు...? ఇవే ప్రశ్నలను అన్నపూర్ణ సుంకర సంధించింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌పై మండిపడింది. దర్శక, నిర్మాతలను కడిగి పాడేసింది. సినిమాల్లో మహిళల పాత్రలు వాస్తవాలకు విరుద్ధంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు సినిమాల్లో మార్పు రావాలని కోరింది.హైదరాబాద్‌కు చెందిన అబ్బాయి ఫేస్‌బుక్‌లో ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి ఫోటోని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తన ఊహాల్లో ఆ అమ్మాయిని లంగా, వోణిలో ఊహించుకుంటాడు. వాస్తవానికి ఆ అమ్మాయి ఆర్మీ ఆఫీసర్ అని , ఆర్మీ యూనిఫాం వేసుకుని ఉంటుందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. దీంతో ఆ అమ్మాయిని పూర్తిగా మార్చేస్తాడు. చీర, లంగావోణి ధరించే అమ్మాయిగా ఆమె మారిపోతుంది. ఇది కరెక్టేనా..? మీ కుటుంబంలోని ఓ మహిళకు ఇలా జరిగితే, తర్వాత వారిద్దరికి పెళ్లి చేయడం మంచిదేనా..? అని అన్నపూర్ణ సుంకర ప్రశ్నించారు. మీరు ఈ విషయంలో ఓకే కాకపోతే, బాహుబలి నుంచి ప్రభాస్‌ తమన్నాను మార్చే సీన్‌ను ఎలా ఆమోదిస్తారు..? అని ఆమె ఓ వీడియోలో ప్రశ్నించింది. ఈ వీడియోకి అసాధారణమైన మద్దతు లభించింది.తెలుగు సినిమా ఎందుకింత పరమ ఘోరంగా మారుతోంది..? ఎదుటి వాళ్లను అవమానించడం, కించపరచడమే కామెడీనా.. ? తెలుగు సినిమా దర్శకుడు కనీస ఆలోచన లేకుండా సినిమాలు తీస్తుంటే వాటిని చూసి మనం ఆనందించాలా..? అని ప్రశ్నించింది. 400 కోట్లు సొంతం చేసుకుందని ఊదరగొడుతున్న బాహుబలిపై కూడా అన్నపూర్ణ సుంకర తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇలాంటి బుద్ధి, జ్ఞానం లేని దర్శకులున్నంత కాలం తెలుగు సినిమా బాగుపడదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఒకర్ని అవమానిస్తే కామెడీ, కొడితే ఎంటర్‌టైన్‌మెంట్‌, రేప్‌ గురించి మాట్లాడితే అది ఫన్నీగా మారిపోయే స్థితిలో తెలుగు సినిమాలు ఉన్నాయని వాపోయింది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌ కల్యాణ్‌.. పెద్ద వయస్కుడైన ఎంఎస్‌ నారాయణను ఎలా కొడతాడని ప్రశ్నించింది. దూకుడు సినిమాలో మహేష్‌ బాబు.. సమంతను నీ కలరేంటి ? నా కలరేంటి ?' అంటూ మాట్లాడటాన్ని తప్పుబట్టింది. కమెడియన్‌ అలీ ఒక సందర్భంలో హీరోయిన్‌పై, ఓ యాంకర్‌పై చేసిన కామెంట్‌పై సుంకర స్పందిస్తూ... అలీ మనిషా..? దున్నపోతా..? అని ఆగ్రహించింది. సినిమా పట్ల ప్రేమతో చాలామంది దర్శకులు, నిర్మాతలు చూపించినదాన్ని ఆమోదించేస్తున్నారని ఆమె బాధపడింది. అలాంటి విషయాలపై భిన్నాభిప్రాయం చెప్పే ఛాన్స్ కూడా లేదని, అలా భిన్నాభిప్రాయం చెప్పడం పెద్ద సాహసంగా మారిందని ఆమె చెప్పుకొచ్చింది.అన్నపూర్ణ వీడియోపై చాలామంది స్పందించారు. కొంతమంది తిడుతూ కూడా కామెంట్లు పెట్టారు. అయితే అన్నపూర్ణ సుంకరకు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది తారల నుంచి మద్దతు లభించింది. నటుడు కమల్ కామరాజు ఈ వీడియోను షేర్ చేస్తూ ఆత్మ పరిశీలన చేసుకున్నారు. ఇది కేవలం సినిమాల సమస్యే కాదని, సొసైటీలో లింగ వివక్షత కారణంగా ఇలా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో ఇలాంటి ధోరణులు ఉండడం వల్ల రైటర్లు కథలు చెప్పేటప్పుడు అది ప్రతిబింబిస్తుందని అన్నారు.అలాగే హీరోయిన్ తాప్సి పన్ను కూడా దీనిపై స్పందించారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రలన్నీ మూస పద్ధతిలోనే ఉంటాయని అన్నారు. ఎప్పుడూ హీరో కోసం వేచి చూడడం, స్వతంత్రత, స్వాభిమానం లేకుండా చిత్రిస్తారని అభిప్రాయపడింది. సమాజంలో ఒద్దికగా ఉండే అమ్మాయిలనే ఇష్టపడతారని అందుకే సినిమాల్లోనూ అలాంటి పాత్రలనే పెడుతున్నట్టు చిత్ర దర్శక, నిర్మాతలు అంటుంటారని తాప్సి అన్నారు. నేను అమాయక అమ్మాయిగా ఉండలేనని, అందుకే చాలా పెద్ద సినిమాలను కోల్పోయానని తాప్సి చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మహిళల పాత్రలపై మార్పు వస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు.


 


అన్నపూర్ణ సుంకర లేవనెత్తిన అంశాలపై సినిమాటోగ్రాఫర్ గుమ్మడి జయకష్ణ కూడా మద్దతు తెలిపారు. అయితే సినిమా పరిశ్రమను పూర్తిగా తప్పుబట్టడం కరెక్ట్‌ కాదని అన్నారు. సొసైటీలోనే ఆ సమస్య ఉందని అభిప్రాయపడ్డారు.ఇలా చాలామంది నుంచి అన్నపూర్ణ వీడియోకు మద్దతు లభించింది. అయితే చాలాకాలం నుంచి సినిమాలు చూస్తున్న అన్నపూర్ణ ఇప్పుడే ఎందుకు ప్రశ్నించారు. అనే అనుమానం చాలామందికి కలగొచ్చు. దానికి కూడా ఆమె సమాధానం చెప్పింది. 24 గంటల్లో ఆడవాళ్లకు సంబంధించిన జుగుప్సాకరమైన విషయాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలియజేసింది. ఓ షోలో ఆలీ ఆడవాళ్లపై చేసే కామెంట్లను తన తల్లిదండ్రులతో చూడలేకపోయానని వివరించింది. అదే మధ్యాహ్నం 2004లో విడుదలైన సై సినిమాలో హీరోయిన్‌ ఈవ్ టీజింగ్ కు గురయ్యే సీన్స్ చూశానని అప్పటి నుంచి దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం మెచ్యూర్ కాకపోవడం గ్రహించానని అన్నారు. అలాగే బాహుబలి ప్రభాస్ తమన్నా డ్రెస్ కోడ్‌ను మార్చడంపై ప్రేక్షకుల నుంచి మద్దతు రావడం లైవ్ డిబెట్‌లో చూడడం తనను వేధించినట్టు అన్నపూర్ణ తెలిపింది. ఏది ఏమైనా టాలీవుడ్‌ సినిమాల్లో స్త్రీ పాత్రల విషయంలో మెచ్యూరిటీ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలను వల్గర్‌గా చూపడం ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com