ఎక్కువగా స్ప్రే చేసినందువలన షార్ట్ సర్క్యూట్ జరిగింది : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 09, 2020, 03:38 PM
 

స్వర్ణ ప్యాలెస్‌లో శానిటైజేషన్ పేరుతో ఎక్కువగా స్ప్రే చేసినందువలన షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్ని ప్రమాదం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన స్వర్ణ ప్యాలెస్‌లో పరిస్థితిని సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ విచారణ ఆ డైరెక్షన్‌లో జరగాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు సంపాదించేందుకు ఎవరుబడితే వారు అనుమతి తీసుకుని కోవిడ్ ఆస్పత్రులు ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. దోచుకుతినేందుకు పెద్దఎత్తున ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.


ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి.. బాధితులందరికీ సరిగ్గా వైద్యం అందిస్తే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయని మధు ప్రశ్నించారు. హోటల్సే ఆస్పత్రులు అవుతున్నాయని, మొన్న గుజరాత్‌లో జరిగిందని, ఇప్పుడు ఇక్కడ జరిగిందన్నారు. రేపో, ఎల్లుండో ఇంకోచోట ప్రమాదం జరగదనే గ్యారంటీ లేదని ఆయన అన్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం స్ప్రే చేయడమేనని, తమకు సమాచారం వచ్చిందని మధు అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, విచారణ వేగవంతం చేసి, వాస్తవాలను వెల్లడించాలని మధు డిమాండ్ చేశారు.