షడ్రక్ ఆశయ సాధనకై పునరంకితమవుదాం

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 07, 2020, 06:57 PM
 

సామాజిక విప్లవోద్యమ కారుడుగా, సమసమాజ స్థాపనకై జీవిత చివరాంకం వరకు కృషి చేసిన షడ్రక్ ఆశయసాధనకై పునరంకితమవుదామని కె.వి.పి.ఎస్. కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు పి యస్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కెకె భవన్ లో కెవిపిఎస్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో షడ్రక్ సంతాప సభ నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సత్యం అధ్యక్షతన జరిగిన సంతాప సభలో పి యస్ రాధాకృష్ణ, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యండి ఆనంద్ బాబు, లెక్చరర్ బడేసాహెబ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, స్కావెంజర్ కార్మికహక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆండ్ర గురుస్వామి, డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు ఎన్ చక్రపాణి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన షడ్రక్ 10వ తరగతి తర్వాత ఐటిఐ పూర్తి చేసి రాయలసీమ పేపర్ మిల్లులో సాదారణ కార్మికుడుగా చేరారన్నారు. తన జీవిత ప్రారంభ దినాలనుండి అనుభవించిన అనేకరకాల సామాజిక రుగ్మతలకు తోడు చేరిన సంస్థలో జరుగుతున్న దోపిడీ కి వ్యతిరేకంగా సంఘం పెట్టి పోరాడటంతో పాటూ మార్క్సిస్టు పార్టీ సభ్యుడు గా చేరి జిల్లా కార్యదర్శి గా, రాష్ట్ర కంట్రోల్ కమీషన్ సభ్యుడు వరకూ పని చేశారన్నారు.కమ్యూనిస్ట్ నాయకుడుగా కొనసాగుతూనే రాష్ట్రములో దళితులపై జరుగుతున్న దారుణ అవమానాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాలన్నీ ఐక్యవేదిక గా ఏర్పడి కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ గా ఏర్పడ్డప్పుడు జిల్లా మొదటి కన్వీనర్ గా ఉన్నారన్నారు. 1998 లో కెవిపిఎస్ ఏర్పడ్డప్పటి నుండి మరణించేంత వరకు సంఘంలో కొనసాగుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. కులవివక్ష రూపాలపై అనేక ప్రత్యక్ష ప్రతిఘటనా కార్యక్రమాలను నిర్వహించి వివక్షను అంతమొందించారన్నారు.ప్రస్తుత కరోనా కాలంలో సహితం దళితులపై దాడులు జరుగుతునే ఉన్నాయని, మరోవైపు సంక్షేమ రాగాలు తీస్తూనే రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎగనామం పెట్టిందన్నారు. కష్టకాలం లో సహితం ప్రజల సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేసిన షడ్రక్ గారికి నివాళి అర్పించడమంటే, సమస్యలపై మరింత పట్టుదలతో కృషిచేయడమే నని, అందుకు పునరంకితమై పనిచేద్దామన్నారు. సంతాప సభ ప్రారంభం లో జంధ్యాల రఘుబాబు, షడ్రక్ ఉద్యమ ప్రస్థానం పై రాసిన పాట ను ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఆశన్న పాడి సభికులందరిచేత కన్నీరు పెట్టించారు. సంతాప సభలో కె.వి.పి.ఎస్. జిల్లా నాయకులు కె రాజకుమార్, సుదర్శన్, విజయమ్మ, శ్యామల, వెంకటస్వామి, బజారి, మాదన్న, మద్దిలేటి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.