ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంధకారంగా మారనున్న ఆన్‌లైన్ ప్రభావం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 06, 2020, 07:04 PM

అమ్మా.. నాకు ఈ మధ్య సరిగా కనపడటంలేదంటూ వర్ణిక ప్రొద్దునే కళ్లు నులుముకుంటూ వచ్చింది. అలాగే, శరీరమంతా ఏదో నలతగా ఉందని నిరసంగా వాళ్ల అమ్మతో అంది. ఎంతో చురుకుగా యాక్టివ్‌గా ఉండే వర్ణిక ఒక్కసారిగా ఇలా డీలా పడిపోవడమేంటని వాళ్ల అమ్మా కంగారు పడింది. వెంటనే వర్ణికను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించింది. వైద్యుడు వర్ణికను పరిష్కించి ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం ఫోన్, కంప్యూటర్ లాంటి గ్యాడ్జెట్స్‌ను అధికంగా చూడటం, వినియోగించడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పాడు. అప్పుడు అర్థమైంది వర్ణిక వాళ్ల అమ్మకి అది ఆన్ లైన్ క్లాసుల ప్రభావం అని. ఇది కేవలం ఒక్క వర్ణిక సమస్యే కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధంలేకుండా ఎదుర్కొంటున్నా సమస్య.కరోనా వైరస్ ఒక్కసారిగా మానవ జీవనశైలిని మార్చివేసింది. లాక్‌డౌన్ కారణంగా జనం జీవన పరిస్థితులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. చాలా వరకు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో గ్యాడ్జెట్స్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు వయస్సుతో సంబంధంలేకుండా గంటల తరబడి ఫోన్, ల్యాప్ ట్యాప్‌ వాడటం తప్పనిసరి అయింది. అందుకు కారణం విద్యార్ధుల భవిష్యత్తు అయోమయంలో పడకూడదని పలు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించాయి. అయితే, ఇప్పుడు ఆ ఆన్ లైన్ క్లాసులే పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఆన్ లైన్‌లో పిల్లలు విద్యనభ్యసించడం వలన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.సర్వేంద్రియానం నయనం ప్రదానం అంటారు. అయితే, ఈ ఆన్ లైన్ క్లాసుల ప్రభావం పిల్లల కంటిచూపుపై ఎక్కువ పడే అవకాశముందని వైద్యులు అంటున్నారు. గంటల తరబడి నిర్విరామంగా ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలో క్లాసెస్ వినడం, చూడటం వల్ల కళ్లలో మంటలు, తలనొప్పి, నిద్ర లేమితోపాటు, కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. మాములుగా పిల్లలకు స్క్రీన్ టైం రోజుకు 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ సేపు మొబైల్‌తో ఉండటం వలన దాని నుంచి వచ్చే రేడియేషన్ పిల్లలపై చాలా ప్రమాదకరం ప్రభావం చూపుతాయి. అందులోనూ పెద్దవాళ్ళ కపాలం కన్నా చిన్న పిల్లల కపాలం పలచగా ఉంటుంది. ఎక్కువ సేపు రేడియేషన్‌కి గురవడం వలన వాళ్ళు నిద్రపోయే తీరు కూడా మారిపోతుందని వైద్యులు అంటున్నారు.అలాగే, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ స్క్రీన్‌ల నుంచి విడుదలయ్యే నీలి రంగు కాంతి నిద్ర పట్టడానికి సహకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుందని కొన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. దీంతో పిల్లల్లో భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తముతున్నాయి. కాగా, పరిస్థితులు చక్కబడి స్కూల్స్ రీ ఓపెన్ చేస్తే ఆన్ లైన్ క్లాసులు అగిపోతాయి. అప్పుడు ఈ ఫోన్ ఫోబియా నుంచి పిల్లలను ఏలా కాపాడుకుంటామనేది తల్లిదండ్రులకు పెద్ద పరీక్షగా మారింది.ఇది ఇలా ఉంటే.. విశాలమైన తరగతుల్లో పాఠ్యంశాలు బోధిస్తేనే విద్యార్ధులకు ఒక్కోసారి అర్థంకాదు. పైగా క్లాసులో ఉన్నప్పుడు పాఠాలతో పాటు సంతోషం, ఆలోచనలు పంచుకోవడం, ఆటలు కూడా ఉంటాయి. ఇప్పుడివన్నీ మిస్ అవుతున్నారు. అలాంటిది ఆన్‌లైన్ బోధన వల్ల విద్యార్ధుల బుర్రలోకి ఏమైనా ఎక్కుతుందా.. అసలు వాళ్లు శ్రద్ధగా పాఠాలు వింటున్నారా అనేది కూడా సమస్యగానే మారింది. పైగా ఈ పద్ధతి ఇటు ఉపాధ్యాయులకు, అటు విద్యార్ధులకు ఇరువురికి కొత్తే. ఈ క్రమంలో విద్యార్దులపై సబ్జెక్ట్ అర్థంకాక మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని సమస్యల మధ్య పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనేది కాలమే నిర్ణయించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com